ఓటీటీలో అదరగొడుతోన్న మాధవన్ చిత్రం
జనవరి 24న ఈ మూవీ జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డైరెక్ట్ గా విడుదలైంది. ఈ సెటైరికల్ కామెడీ థ్రిల్లర్ చిత్రాన్ని అశ్వినీ ధీర డైరెక్ట్ చేశాడు.;
తమిళ సీనియర్ నటుడు మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన వెరైటీ చిత్రం ‘హిసాబ్ బరాబర్’. జనవరి 24న ఈ మూవీ జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డైరెక్ట్ గా విడుదలైంది. ఈ సెటైరికల్ కామెడీ థ్రిల్లర్ చిత్రాన్ని అశ్వినీ ధీర డైరెక్ట్ చేశాడు. ట్రైలర్ రిలీజైన తర్వాత నుంచి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఓటీటీలో ఈ చిత్రం విశేషమైన వ్యూస్‌ను సాధిస్తూ దూసుకుపోతోంది.
‘హిసాబ్ బరాబర్’ చిత్రానికి మొదటి రోజు నుంచే మంచి స్పందన లభించింది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, వ్యూస్ పరంగా ఈ సినిమా జీ5 ప్లాట్‌ఫామ్‌లో జనవరి 26 నాటికి నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. హిందీలో తెరకెక్కిన ఈ చిత్రం.. తెలుగు, తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుండటం దీని వ్యూస్ పెరగడానికి తోడ్పడింది.
రాధే మోహన్ (మాధవన్) తన నిజాయితీతో విధులు నిర్వర్తించే టీసీ. సీఏ చదువుకొని టీసీగా పని చేస్తున్న అతనికి.. ఒక రోజు తన అకౌంట్‌లో ₹27.50 మాయం అయినట్లు తెలుసుకొంటాడు. బ్యాంకు అధికారులను ప్రశ్నించినపుడు వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో.. నిజాలు బయటపెట్టేందుకు అతడు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో, అతడు ఏకంగా ₹2000 కోట్ల బ్యాంకింగ్ స్కామ్‌ను కనుగొంటాడు. ఈ స్కామ్ వెనుక ఉన్న నిజాలు, ఆపై జరిగిన సంఘటనల చుట్టూ ఈ కథ నడుస్తుంది.
సినిమాకు ఆసక్తికరమైన కథా నేపథ్యం ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కొన్ని సోషల్ మీడియా వేదికలపై కథనం మరింత ఆకట్టుకునేలా ఉండాల్సిందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, సెటైరికల్ కామెడీ, సమాజం మీద వ్యంగ్యం, బ్యాంకింగ్ వ్యవస్థ లోపాల ప్రదర్శన వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో ఇంకా కృతి కుల్హారీ, నీల్ నితిన్ ముకేశ్, రషామీ దేశాయ్, శౌనక్ దుగ్గల్ వంటి ప్రముఖులు నటించారు. జియో స్టూడియోస్, ఎస్‌పీ సినీకార్ప్ బ్యానర్లపై జ్యోతి దేశ్‌పాండే, శరద్ పటేల్, శ్రేయాన్షి పటేల్ నిర్మించారు.