థియేటర్స్ లోకి వచ్చిన వారంరోజుల్లోనే ఓటీటీలోకి !
జనవరి 24న మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘ఐడెంటిటీ’ తెలుగులో థియేటర్లలో విడుదలైంది.;
విభిన్న భాషల్లో విజయవంతమైన సినిమాలను డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఇప్పుడు సర్వసాధారణమైంది. ముఖ్యంగా.. ఓటీటీ వేదికలు ఈ ప్రక్రియకు కొత్త ఊపును తీసుకొచ్చాయి. తాజాగా, జనవరి 24న మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘ఐడెంటిటీ’ తెలుగులో థియేటర్లలో విడుదలైంది. టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రల్లో అఖిల్ పాల్, అనాస్ ఖాన్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. మలయాళంలో అద్భుతమైన విజయం సాధించింది. సంక్రాంతి తర్వాత తెలుగులో ఆసక్తికరమైన చిత్రాలేమి లేకపోవడంతో.. ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయాలని నిర్ణయించారు.
మలయాళంలో థియేట్రికల్ రన్ పూర్తయ్యాక.. జీ5 ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ‘ఐడెంటిటీ’ జనవరి 31న జీ5లో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. తెలుగులో రిలీజ్ అయిన కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలో విడుదల కావడం విశేషం.
సీఐ అలెన్ (వినయ్ రాయ్) ఓ కీలక కేసు విచారణ కోసం కేరళకు వెళ్తాడు. అక్కడ అతడు అలీషా (త్రిష)ను విచారించాల్సి వస్తుంది. రోడ్డు ప్రమాదానికి గురైన అలీషా.. తన చుట్టూ ఉన్నవారిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటుంది. ఆమెకు సహాయం చేసేందుకు హరన్ (టొవినో థామస్) అనే వ్యక్తి ముందుకు వస్తాడు. హరన్ ఎవరు? అలీషా, అలెన్‌లకు ఉన్న సంబంధం ఏమిటి? అలీషా చెప్పిన వివరాలు కేసు పరిష్కారానికి ఎలా దోహదపడతాయి? వీటన్నింటి చుట్టూ మలచిన ఆసక్తికర కథే ఈ సినిమా.
తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, ‘ఐడెంటిటీ’ మలయాళంలో రూ. 18 కోట్లకు పైగా వసూలు చేసింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. మిస్టరీతో నిండిన కథ, ప్రధాన నటీనటుల అద్భుత ప్రదర్శన తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి.