'హిట్ 3'లో కాశ్మీర్ ఎపిసోడ్!
ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గామ్‌లో జరిగిన తీవ్రవాద దాడి దేశాన్ని విషాదంలో ముంచెత్తింది. అదే నేపథ్యాన్ని స్ఫురించేలా తెరకెక్కిన ఘట్టం 'హిట్ 3'లో ఉంటుందట.;
ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గామ్‌లో జరిగిన తీవ్రవాద దాడి దేశాన్ని విషాదంలో ముంచెత్తింది. అదే నేపథ్యాన్ని స్ఫురించేలా తెరకెక్కిన ఘట్టం 'హిట్ 3'లో ఉంటుందట. ఈ యథార్థ దాడి కంటే మునుపే 'హిట్ 3' చిత్రంలో జమ్మూ కాశ్మీర్‌లో అర్జున్ సర్కార్ పాత్ర ఎదుర్కొనే ఉగ్రదాడి ఎపిసోడ్ చిత్రీకరించబడింది.
నాని పోషించిన అర్జున్ సర్కార్ పాత్ర, ఈ ఘట్టం ద్వారా కథను కొత్త మలుపులోకి తీసుకువెళ్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అతని ఎమోషనల్ పెర్ఫార్మెన్స్, తీవ్రవాదంతో జరిగిన ఉత్కంఠభరితమైన పోరు, ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుందని తెలుస్తోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఈ ఎపిసోడ్‌లో ఎమోషన్స్ ఆకట్టుకుంటాయట.
శ్రీనిధి శెట్టితో నానికి ఉండే రొమాంటిక్ ట్రాక్ కూడా కాశ్మీర్ నేపథ్యంలోనే నడుస్తుందని సమాచారం. ట్రైలర్‌లో కొన్ని గ్లింప్స్ చూసినవారు ఇప్పటికే ఈ ఎమోషనల్ లింక్‌ను పసిగట్టారు. మే 1న విడుదల కానున్న 'హిట్ 3 బుకింగ్స్ ఊహించని స్థాయిలో ఊపందుకున్నాయి. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, నాని కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే సినిమా కావొచ్చని భావిస్తున్నారు. ఈరోజు 'హిట్ 3' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడు.