'ఇడ్లీ కొట్టు' రివ్యూ
సెప్టెంబర్ నెల తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి విజయాలను అందించింది. ఇదే ఊపులో అక్టోబర్ ప్రారంభంలోనే ఆడియన్స్ ముందుకు వచ్చింది ‘ఇడ్లీ కొట్టు‘.;
నటీనటులు: ధనుష్, నిత్యా మీనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: కిరణ్ కౌశిక్
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఎడిటింగ్ : జి.కె. ప్రసన్న
నిర్మాతలు: ఆకాష్ బాస్కరన్, ధనుష్
దర్శకత్వం: ధనుష్
విడుదల తేది: అక్టోబర్ 1, 2025
సెప్టెంబర్ నెల తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి విజయాలను అందించింది. ఇదే ఊపులో అక్టోబర్ ప్రారంభంలోనే ఆడియన్స్ ముందుకు వచ్చింది ‘ఇడ్లీ కొట్టు‘. ‘కుబేర‘ వంటి విజయం తర్వాత ధనుష్ నుంచి వచ్చిన చిత్రం కావడంతో ‘ఇడ్లీ కొట్టు‘పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి.. ఆ అంచనాలను ‘ఇడ్లీ కొట్టు‘ అందుకుందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
శంకరాపురం అనే చిన్న గ్రామంలో శివకేశవులు (రాజ్ కిరణ్) నడిపే ఇడ్లీ కొట్టు బాగా ప్రసిద్ధి. ఆ ఇడ్లీ రుచి, ఆ దుకాణం పట్ల ఆయనకున్న అంకితభావం ఊర్లో ప్రతి ఒక్కరి కడుపు మాత్రమే కాదు, హృదయాన్నీ నింపుతుంటుంది. కానీ ఆయన కొడుకు మురళి (ధనుష్) మాత్రం కొత్తతరం ఆలోచనలతో పెద్ద లక్ష్యాల కోసం కలగంటాడు. ఇడ్లీ కొట్టు పేరుతో ఫ్రాంచైజీలు పెట్టి వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటాడు. కానీ తన చేత్తో చేసిన ఇడ్లీలే తన గౌరవమని భావించిన శివకేశవులు దానికి ఒప్పుకోడు.
ఈ బేధాభిప్రాయం తండ్రి, కొడుకుల మధ్య దూరం పెంచుతుంది. మురళి కుటుంబాన్ని వదిలి బ్యాంకాక్ చేరి, విష్ణువర్ధన్ (సత్యరాజ్) కంపెనీని విజయవంతం చేస్తాడు. అతని కూతురు మీరా (షాలినీ పాండే)తో పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది. కానీ సరిగ్గా ఆ సమయంలో తండ్రి మరణం మురళీకి తన మూలాలను గుర్తు చేస్తుంది.
తండ్రి ఆత్మగా భావించిన ‘ఇడ్లీ కొట్టు’ మూతపడిన తర్వాత, మురళి తిరిగి ఊరికి వచ్చి ఆ వారసత్వాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తాడు. అతని ప్రయాణంలో కళ్యాణి (నిత్యామీనన్) ఇచ్చిన మద్దతు ఏంటి? అశ్విన్ (అరుణ్ విజయ్)తో ఎలాంటి ప్రతిఘటనలు ఎదురయ్యాయి? అనేది మిగతా కథ.
విశ్లేషణ
సొంతూరుకి వెళ్ళినప్పుడల్లా కనిపించే చెట్లు, కొట్లు, గుడులు, బడి, మనుషుల పలకరింపులు ప్రతి దానికి ఒక కథ ఉంటుంది. అలాంటి అనుభూతినే తెరపైకి తీసుకొచ్చాడు ధనుష్. ఒక సాధారణ ఇడ్లీ కొట్టు నుంచి పుట్టిన కథను ప్రేక్షకుల ముందు పెట్టాడు.
ఫస్టాఫ్‌లో ఊరి జ్ఞాపకాలు, తండ్రి-కొడుకుల బంధం ఎమోషనల్‌గా కట్టిపడేస్తాయి. తండ్రి త్యాగం, తల్లి మమకారం, ఊరి వాతావరణం – ఇవన్నీ కలిపి సినిమా ఓ ఎమోషనల్ రైడ్‌గా మారాయి. కానీ సెకండ్ హాఫ్ కథ ట్రాక్ మారడం కొంత నిరాశ కలిగిస్తుంది. మళ్లీ క్లైమాక్స్‌లో అసలైన ‘ఇడ్లీ కొట్టు’ హృదయాన్ని తాకుతుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటుల విషయానికొస్తే ధనుష్.. మురళి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. టీనేజ్ బాయ్‌గా, కార్పొరేట్ వ్యక్తిగా, మళ్లీ పల్లెటూరి యువకుడిగా మూడు లుక్స్‌లోనూ నేచురల్‌గా కనిపించాడు. నిత్యామీనన్ కల్యాణి పాత్రలో సహజమైన నటనతో ఆకట్టుకుంది.
రాజ్‌కిరణ్ తండ్రి శివకేశవుడి పాత్రలో హృదయాన్ని తాకే నటనతో ఆకట్టుకున్నాడు. షాలినీ పాండే మీరా పాత్రలో ట్రెండీగా కనిపించి, క్లైమాక్స్ సన్నివేశాల్లో కీలకంగా నిలిచింది. అరుణ్ విజయ్, సత్యరాజ్, సముద్రఖని, పార్తీబన్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ ఎలిమెంట్స్ విషయానికొస్తే జి.వి. ప్రకాష్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్. ప్రత్యేకంగా ఎమోషనల్ సీన్స్‌లో బీజీఎం సన్నివేశాలకు ప్రాణం పోసింది. అయితే పాటలు అంతగా లేవు. కిరణ్ కౌశిక్ కెమెరా వర్క్ రిచ్‌గా ఉంది.
చివరగా
‘ఇడ్లీ కొట్టు‘.. డీసెంట్ ఫ్యామిలీ డ్రామా