‘వీరమల్లు‘ టికెట్ ధరల పెంపు

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన పీరియాడిక్ మూవీ ‘హరి హర వీరమల్లు‘. జూలై 24న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్న ఈ చిత్రం టికెట్ రేట్లపై కీలకమైన అప్డేట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ‘హరిహర వీరమల్లు‘ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి లభించింది.
అప్పర్ క్లాస్ టికెట్ ధర రూ.150 వరకు, మల్టీప్లెక్స్‌లలో రూ.200 వరకు పెంచుతూ జీవో జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ పెంపు 10 రోజుల పాటు అమల్లో ఉండనుంది. మరోవైపు ‘హరిహర వీరమల్లు‘ చిత్రానికి వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్ లో ప్రీమియర్ షో లను వేయబోతున్నారట.
లేటెస్ట్ గా నిర్మాత ఎ.ఎమ్.రత్నం మాట్లాడుతూ.. ‘మొదట తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి షోలు వేద్దాం అనుకున్నాం. కానీ ఫ్యాన్స్ ముందుగానే షోలు వేయమని అడుగుతున్నారు. అందుకే ముందురోజు రాత్రి 9.30 గంటల నుంచి షోలు వేసే ఆలోచనలో ఉన్నాము. ఏపీలో అనుమతులు వస్తాయి. తెలంగాణలో కూడా అనుమతులు వస్తాయి. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారితో, సినిమాటోగ్రఫీ మంత్రి వెంకటరెడ్డి గారితో మాట్లాడాము అన్నారు.‘
ఏపీలో ఎలాగో తెల్లవారుజామున షోలు ఉంటాయని ముందే ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ప్రీమియర్స్ కూడా ఉన్నాయి అని చెప్పడంతో ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు. అయితే తెలంగాణలో ‘పుష్ప 2‘ సంఘటన తర్వాత ప్రీమియర్లు, తెల్లవారు జామున షోలకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ‘హరిహర వీరమల్లు‘ సినిమాకు పర్మిషన్ ఇస్తారా? లేదా అనేది చూడాలి.
ఇప్పటికే అమెరికాలో ‘వీరమల్లు‘ టికెట్ సేల్స్ మొదలయ్యాయి. వాటికి మంచి రెస్పాన్స్ వస్తోందట. మరోవైపు జూలై 21న హైదరాబాద్ శిల్పా కళావేదికలో ‘హరిహర వీరమల్లు‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ తో పాటు.. కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ లు హాజరు కానున్నారు.
-
Home
-
Menu