అలనాటి అందాల తార బి.సరోజాదేవి ఇకలేరు

అలనాటి అందాల తార బి.సరోజాదేవి ఇకలేరు
X
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రరంగాల్లో తన ప్రత్యేక ముద్ర వేసిన నటి, అభినయ సరస్వతి డాక్టర్ బి.సరోజా దేవి (87) కన్నుమూశారు.

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రరంగాల్లో తన ప్రత్యేక ముద్ర వేసిన నటి, అభినయ సరస్వతి డాక్టర్ బి.సరోజా దేవి (87) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో ఈరోజు ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌, రాజ్‌కుమార్‌, దిలీప్‌కుమార్‌ వంటి దిగ్గజులతో కలిసి నటించిన అందాల తారగా, గ్లామర్‌ ఐకాన్‌గా ఆమె చిరస్థాయిగా గుర్తింపొందారు.

బెంగళూరులో జన్మించిన సరోజా దేవి, తండ్రి ప్రోత్సాహంతో చిన్ననాటి నుంచే నాటకాల్లో పాల్గొన్నారు. 13వ ఏట ‘మహాకవి కాళిదాస’ ద్వారా వెండితెరకి పరిచయమై, కన్నడ చిత్రాల్లో అడుగుపెట్టారు. ‘కిట్టూరు చెన్నమ్మ’ చిత్రంతో ఆమెకు విశేష గుర్తింపు లభించింది.

తమిళ చిత్రరంగంలో ఎంజీఆర్‌తో కలిసి చేసిన ‘నాడోడిమన్నన్’ బాక్సాఫీస్ హిట్‌గా నిలిచి ఆమెను స్టార్‌ హీరోయిన్‌గా నిలబెట్టింది. ఇదే సమయంలో ఎన్టీఆర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘పాండురంగ మహాత్మ్యం’ ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘జగదేక వీరుని కథ, సీతారామ కళ్యాణం, దాగుడుమూతలు, ఇంటికి దీపం ఇల్లాలే’ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.

ఏఎన్నార్‌తో కలిసి ‘పెళ్లికానుక, ఆత్మబలం, శ్రీకృష్ణార్జున యుద్ధం’ వంటి చిత్రాలు చేస్తూ తన అభినయ ప్రతిభను చాటారు. ముఖ్యంగా ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ పాటలో ఆమె చూపిన చురుకుదనం, నటన ఎన్నడూ మరచిపోలేనివి.

ఆమె మాట్లాడే తెలుగు పలుకుల్లో కన్నడ యాస ఉన్నా, అదే ప్రత్యేకతగా మారింది. అప్పటి కాలంలో ఆమె ధరించిన చీరలు, ఆభరణాలు, హెయిర్‌స్టైల్‌లకు అప్పట్లో యువతులు బాగా ఫాలో అయ్యేవారు. హిందీలో ‘ససురాల్, పైగామ్, బేటా-బేటి’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ (1969), పద్మభూషణ్‌ (1992) పురస్కారాలతో పాటు, 2009లో ఎన్టీఆర్ జాతీయ అవార్డుతో గౌరవించింది.

విభిన్న భాషల్లో దాదాపు 190కి పైగా చిత్రాల్లో నటించిన బి.సరోజా దేవి సినీ ప్రపంచానికి అమూల్యమైన నిధిగా నిలిచారు. ఆమె లేకపోవడం భారత సినిమా రంగానికి తీరని లోటు.

Tags

Next Story