'ది 100' మూవీ రివ్యూ

ది 100 మూవీ రివ్యూ
X
బుల్లితెరపై ఆర్కే నాయుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్కే సాగర్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ది 100’.

నటీనటులు: ఆర్కే సాగర్, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, వీవీ గిరిధర్, ఆనంద్, లక్ష్మీ గోపాల స్వామి, కల్యాణి నటరాజన్, బాలకృష్ణ, జయంత్, విష్ణు ప్రియ, తారక్ పొన్నప్ప త‌దిత‌రులు

సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ పూష‌డపు

దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్

విడుదల తేది: జూలై 11, 2025

బుల్లితెరపై ఆర్కే నాయుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్కే సాగర్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ది 100’. ఈ సినిమాలో మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలు పోషించారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన 'ది 100' మూవీ ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ

నగరంలో వరుస దోపిడీలు, హత్యలు కలకలం రేపుతాయి. అదే సమయంలో శిక్షణ పూర్తిచేసుకున్న ఐపీఎస్ విక్రాంత్ (ఆర్కే సాగర్) ఆ కేసును టేకప్ చేస్తాడు. అమావాస్యల రోజుల్లో మాత్రమే జరిగే ఈ మిస్టీరియస్ దొంగతనాలు, నగరాన్ని భయపెట్టే స్థాయికి చేరుతాయి.

ఇంతలో మధుప్రియ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వీడియో కాల్‌లో ఉండగానే ఆత్మహత్య చేసుకోవడం కథకు మరింత మలుపు తీసుకువస్తుంది. దొంగతనాలకు, ఈ ఆత్మహత్యకి సంబంధం ఉందా అనే సందేహంతో విక్రాంత్ దర్యాప్తు సాగిస్తాడు. అదే సమయంలో తనకు ఇష్టమైన యువతి ఆర్తి (మిషా నారంగ్) కూడా ఈ ముఠా బాధితురాలేనని తెలిసి, కేసును మరింత వ్యక్తిగతంగా తీసుకుంటాడు.

విక్రాంత్ శ్రమలు ఫలిస్తాయనుకుంటున్న తరుణంలో.. అసలు ఆర్తిపై జరిగిన అత్యాచారం వెనుక ఉన్నది ఈ ముఠా కాదని తెలుస్తుంది. మరి.. ఈ నేరాల వెనుక అసలైన మాస్టర్‌మైండ్ ఎవరు? మధుప్రియ ఎందుకు సూసైడ్ చేసుకుంది? మైనర్లను ఇలా నేరానికి నెట్టిన శక్తి ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘ది 100’ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

'ది 100' ఒక క్రైమ్ థ్రిల్లర్. ఇటీవ‌ల వెండితెర‌పైనా, ఓటీటీ వేదిక‌ల్లోను ఈ తరహా క్రైమ్ థ్రిల్ల‌ర్స్‌కు మంచి ఆద‌ర‌ణ దక్కుతుంది. ఐపీసీ సెక్షన్ 100ను ఆధారంగా చేసుకుని దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన ఈ సినిమా థ్రిల్, ఎమోషన్, యాక్షన్ మేళవింపుతో సాగుతుంది.

హీరో విక్రాంత్ పరిచయంతో కథ మొదలై, ఒక హత్యా కేసు దర్యాప్తులోకి వెళ్లిన తరువాత అసలైన కథ ప్రారంభమవుతుంది. స్పాట్‌లో దొరికిన ఆధారాల ఆధారంగా ముఠాను గుర్తించడంలో జరిగే పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. గ్యాంగ్‌ వెనుక ఉన్న మైండ్‌ గేమ్‌, హీరో చూపిన తెలివితేటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఒక కీలక ట్విస్ట్‌ ప్రేక్షకుడిని షాక్‌కు గురి చేస్తుంది. అయితే, కేసు పరిష్కారం తీరులో కొంత రొటీన్ ఫీలింగ్ అనిపిస్తుంది.

సెకండాఫ్ లో మధుప్రియ పాత్రతో కథకు కొత్త కోణం చూపించినా, క్లైమాక్స్ సన్నివేశాలు అంతగా ప్రభావం చూపించలేకపోయాయి. అయినా, థ్రిల్‌ మూమెంట్స్‌కి అవసరమైన బేసిక్ ఎలిమెంట్స్‌ను దర్శకుడు అందించగలిగాడు. చివర్లో చెప్పిన సందేశం మంచి ఫీలింగ్‌ను కలిగిస్తుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

ఐపీఎస్ విక్రాంత్‌గా ఆర్కే సాగర్ సెటిల్డ్ పెర్ఫామెన్స్ చేశాడు. ‘మొగలిరేకులు’లో ఆర్కే నాయుడు పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న సాగర్‌, అదే ఇంపాక్ట్‌ను తెరపై కొనసాగించడంలో విజయం సాధించాడు. సాగర్ నేచురల్ పెర్ఫామెన్స్, ఫిట్‌నెస్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటాయి.

హీరోయిన్ మిషా నారంగ్ అందంతోనూ, భావోద్వేగ సన్నివేశాలతోనూ మెప్పించింది. హీరో తల్లి, సైకియాట్రిస్ట్ పాత్రల్లో కళ్యాణి నటరాజన్ మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ చూపించారు. ఇంకా.. ధన్య బాలకృష్ణ, విష్ణు ప్రియ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. 'పుష్ప' ఫేమ్ తారక్ పొన్నప్ప స్టైలిష్ విలన్‌గా ఇంప్రెస్ చేశాడు.

సాంకేతికంగా హర్షవర్ధన్ రమేశ్వర్ సంగీతం, శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలాలు. ఎడిటింగ్ పరంగా ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్లు ట్రిమ్ చేస్తే మరింత క్రిస్ప్‌గా ఉండేది. బడ్జెట్ పరిమితుల్లో యాక్షన్ సన్నివేశాలు బాగానే తీశారు. నిర్మాణ విలువలు పరంగా మాత్రం సినిమా గ్రాండ్‌గా కనిపిస్తుంది.

చివరగా

'ది 100'.. ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్

Telugu70MM: 3 / 5

Tags

Next Story