ఆస్కార్ రేసులో తెలుగు సినిమాలు

ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్స్ కోసం ప్రతి ఏడాది వందలాది సినిమాలు పోటీ పడతాయి. అందులో ఒకే ఒక్క చిత్రం మాత్రమే ప్రతీ దేశం తరఫున బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి ఎంపిక అవుతుంది. ఈసారి ఆ రేసులో తెలుగు చిత్రాలు గట్టి పోటీ ఇవ్వడం విశేషం.
2026 ఆస్కార్ అవార్డుల కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 24 సినిమాలను షార్ట్‌లిస్ట్ చేసింది. అందులో తెలుగు నుంచి ఐదు చిత్రాలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. అవి.. 'పుష్ప 2: ది రూల్, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప, కుబేర, గాంధీ తాత చెట్టు'.
ముందుగా 'పుష్ప 2: ది రూల్' విషయానికొస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి, దేశవ్యాప్తంగా హవా చూపింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సీక్వెల్‌కి గ్లోబల్ లెవెల్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఈ సంక్రాంతి బరిలో కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మైథలాజికల్ స్టోరీతో తెరకెక్కి మంచి విజయాన్ని సాధించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కీలక పాత్రల్లో నటించిన 'కుబేర' ధనవంతుల ఆశలు, పేదవారి ఆవేదనల మధ్య పోరాటాన్ని ఆవిష్కరించింది. ఇంకా.. సుకుమార్ కుమార్తె సుకృతి వేణి నటించిన 'గాంధీ తాత చెట్టు' ఇప్పటికే పలు వేదికలపై అవార్డులు అందుకుంది.
ఈ తెలుగు సినిమాలతో పాటు హిందీ, మరాఠీ, కన్నడ, మణిపురి భాషలకు చెందిన సినిమాలు కూడా పోటీలో ఉన్నాయి. మొత్తంగా.. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒకేసారి ఐదు సినిమాలు ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో ఉండడం ఇదే మొదటిసారి.
ఇప్పటికే 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ రావడంతో, ప్రపంచానికి తెలుగు సినిమా క్రేజ్ ఏంటో తెలిసింది. ఆ విజయానంతరం ఈసారి ఐదు తెలుగు సినిమాలు ఆస్కార్ రేసులో ఉండటం గర్వకారణం. తుది ఎంపికలో వీటిలో ఏదైనా ముందుకు వస్తే, అది టాలీవుడ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం అవుతుంది.
-
Home
-
Menu