సాహసానికి మారుపేరు సూపర్‌స్టార్

తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాత్మక కథానాయకులలో కృష్ణ ప్రత్యేకమైన స్థానం సంపాదించారు. మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా ఆయన పేరొందారు. సినిమాల విషయంలో నిజాయితీతో వ్యవహరిస్తూ, విజయాలు-అపజయాల విషయంలో నిర్మొహమాటంగా స్పందించేవారు.
‘తేనెమనసులు’తో హీరోగా పరిచయం అయిన కృష్ణ, ఇండస్ట్రీలో ఎందరో మనసులు గెలుచుకుని, ఒక్కో మెట్టు ఎక్కుతూ సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఆపకుండా ముందుకు సాగే ధైర్యమే ఆయనను 'డేరింగ్ అండ్ డాషింగ్ హీరో'గా మార్చింది.
కృష్ణ నటించిన 345 సినిమాలు, దర్శకత్వం వహించిన 14 చిత్రాలు, నిర్మాతగా 50కిపైగా సినిమాలు అన్నీ ఆయన నిస్వార్థ ప్రేమకు, సినీ ప్రయోగాలకు నిదర్శనాలు. తెలుగు సినీ చరిత్రలో తొలి స్కోప్ మూవీ, తొలి 70 ఎమ్.ఎమ్ చిత్రం, తొలి ఈస్ట్ మన్ కలర్, తొలి తెలుగు కౌబాయ్ మూవీ అనే ఎన్నో తొలి ఘనతలు ఆయన ఖాతాలో ఉన్నాయి.
తన ప్రయాణంలో ఎంతోమంది కొత్త నిర్మాతలకు అవకాశాలు కల్పించారు. ఒక నిర్మాతను నష్టపోయే పరిస్థితిలో చూడలేక, డేట్లు ఇచ్చి మరో సినిమా తీసేలా ప్రోత్సహించేవారు. విడుదలకు ముందు సమస్యలు ఎదురైతే తన పారితోషికాన్ని వదులుకునే పెద్ద మనసు ఆయనదే. సినిమా వ్యాపారంపై అపారమైన అవగాహన ఉండేది కృష్ణకు. ఒక నటుడిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా, పంపిణీదారుడిగా, ఎగ్జిబిటర్‌గా వ్యాపారంలో కూడా తన ముద్ర వేసిన ఘనత కృష్ణది.
కృష్ణకు 'సూపర్ స్టార్' బిరుదు ప్రేక్షకులే ఇచ్చారు. ఆ స్థాయిలో వారి హృదయాల్లో నిలిచిపోవడం చరిత్రలో అరుదైన ఘనత. 2022 నవంబర్ 15న ఆయన మరణం అభిమానులను విషాదంలో ముంచినా… ఆయన అందించిన సాహస మార్గదర్శకత్వం, సినీ సేవలు తరాల పాటు గుర్తుండిపోయే ఘనతలు. తెలుగు సినిమాకు సూపర్ స్టార్ కృష్ణ ఒక వెలకట్టలేని ఆస్తి. ఈరోజు (మే 31) సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తుంది తెలుగు 70 ఎమ్.ఎమ్.
-
Home
-
Menu