
'శుభం' రివ్యూ

నటీనటులు: సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపుడి తదితరులు
సినిమాటోగ్రఫీ: మృదుల్ సుజిత్ సేన్
సంగీతం: షోర్ పోలీస్ (నేపథ్యం: వివేక్ సాగర్)
ఎడిటింగ్ : ధర్మేంద్ర కాకరాల
నిర్మాతలు: సమంత (ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్)
దర్శకత్వం: ప్రవీణ్ కాండ్రేగుల
విడుదల తేది: మే 9, 2025
స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ ఈరోజు (మే 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' పేరిట సమంత ప్రారంభించిన ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన ఈ చిత్రాన్ని 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించాడు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో మంచి బజ్ ను క్రియేట్ చేసింది. మరి.. 'శుభం' ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
వైజాగ్‌కు సమీపంలో ఓ ప్రశాంతమైన పల్లెటూరు భీముని పట్నం. అప్పటి రోజుల్లో డీటీఎచ్ అంటే అద్భుతం. కేబుల్ టీవీ ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు శ్రీను (హర్షిత్ రెడ్డి). శ్రీనుకి పెళ్లి కాకపోయినా, అతని స్నేహితులు ఇద్దరూ గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి అప్పటికే పెళ్లిళ్లు చేసుకుని భార్యలతో కాపురం చేస్తుంటారు. అయితే ఒక్కసారి పెళ్లైందంటే ఆట మొదలవుతుంది. ‘భార్యలు చెప్పిందే శాసనం’ అనే సిద్ధాంతాన్ని స్నేహితులిద్దరూ శ్రీనుకు బోధిస్తారు.
ఇంతలో శ్రీను జీవితంలోకి శ్రీవల్లి (శ్రియ కొంతం) ప్రవేశిస్తుంది. వారి వివాహం ఎంతో ఆనందంగా జరగుతుంది. కానీ.. ఫస్ట్‌నైట్ నుంచే పరిస్థితులు తారుమారు అవుతాయి. మొదటి రాత్రి అతడి జీవితంలో కొత్త అధ్యాయం మొదలవబోతోంది అనుకుంటాడు. కానీ ఆ రాత్రే ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. భార్య శ్రీవల్లి, రొమాంటిక్ వేళలో అతడిని పక్కన పెట్టి టీవీ సీరియల్‌లో మునిగిపోతుంది. అంతేకాదు, కొన్ని క్షణాల్లో ఆమె ప్రవర్తన మారిపోతుంది. కళ్ళు పెద్దవైపోతాయి, స్వరంలో తేడా, చేతులు వింతగా ఊగుతుంటాయి.
కట్ చేస్తే శ్రీనివాస్ ఫ్రెండ్స్ పరిస్థితీ అంతే. వారి భార్యలు కూడా అదే రాత్రి, అదే టైంలో, అదే ఛానెల్ చూస్తూ అదే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఊరంతా అదే తంతు. రాత్రి 9 గంటలకే ఆడవాళ్లు అంతా ఆ సీరియల్‌ను చూస్తూ ఒకేలా మానసిక స్థితిని కోల్పోతుంటారు.
ఈ సంక్షోభ సమయంలో గ్రామానికి వస్తుంది మాయ (సమంత), ఒక పారా-సైకాలజిస్టు. ఈ సీరియల్ వెనుక ఉన్న శక్తి ఏంటి? ఎందుకు అది ఆడవాళ్లనే టార్గెట్ చేస్తోంది? శ్రీనివాస్, అతని ఫ్రెండ్స్, మాయ కలిసి ఈ మానసిక మహమ్మారిని ఎలా ఎదుర్కొన్నారు? చివరకు ఆ సీరియల్‌కు 'శుభం' కార్డ్ పడిందా? లేదా? అన్నది అసలైన ట్విస్ట్.
విశ్లేషణ
హారర్ కామెడీని మిళితం చేస్తూ ప్రేక్షకులను అలరించాలనే లక్ష్యంతో వచ్చింది ‘శుభం’. తెలుగు సినిమా హారర్-కామెడీ జానర్ లో అనేక ప్రయోగాలు చూశాం. కానీ 'శుభం' అనే సినిమా, సీరియల్ పిచ్చి అనే కొత్త అంశాన్ని తెరపై ఆవిష్కరించింది. ఈ సినిమాతో హారర్-కామెడీ జానర్ లో ఓ సరికొత్త మెస్సేజ్ అందించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల.
సినిమా మొదలవగానే 'పాలు నీళ్ల బంధం.. ఇది జన్మజన్మల బంధం' అనే పాటతో ఓ సీరియల్ ప్రిమైస్‌ను పరిచయం చేయడం దర్శకుడి తెలివైన ప్రయత్నం. అదే సీరియల్ చుట్టూ ఊరిలోని మహిళల ప్రవర్తన మారిపోవడం, రాత్రిపూట వారి భర్తలకు భయం కలిగించడం అనేది క్రేజీ ఐడియా.
ముగ్గురు ఫ్రెండ్స్ భార్యలు రాత్రిపూట సీరియల్ చూస్తూ మారుతున్న ప్రవర్తన, ఆ సీరియల్ వల్ల ఊరిలో మహిళలంతా ఏకంగా దెయ్యాల్లా మారిపోవడం ఎంటర్‌టైనింగ్ గానే కాక, భయాన్ని కలిగించేలా కుదిరింది. దీని వెనుక కారణాన్ని దర్శకుడు సీక్రెట్‌గా ఉంచి, ఇంటర్వెల్ వద్ద ఓ మేజర్ ట్విస్ట్ ద్వారా షాకివ్వడం కథపై మరింత ఆసక్తిని పెంచింది.
సినిమాలో చూపించిన సీరియల్ ప్రభావం, ప్రతీ ఇంట్లో చూస్తుండేదే కదా అనిపించేలా దర్శకుడు ఆ సన్నివేశాలను తీర్చిదిద్దాడు. కామెడీ అంశాలే కాకుండా, భార్యాభర్తల మధ్య ఉండే భావనలను హృద్యంగా ఆవిష్కరించడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. సీరియస్ ఎమోషన్లలో వచ్చే హిలేరియస్ సీన్స్ ఒక పక్క నవ్విస్తూనే, మరోపక్క హృదయాన్ని తాకే మోమెంట్స్ కూడా అందిస్తాయి.
మొత్తంగా దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల 'శుభం' చిత్రం ద్వారా ఒక ముఖ్యమైన సందేశాన్ని వినోదభరితంగా చూపించాడు. పురుషాధిక్యత, మహిళల అణచివేత, ఆత్మాభిమానం వంటి సున్నితమైన విషయాలకు సీరియల్స్ తో ముడిపెట్టి చెప్పాడు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
ఈ చిత్రం పూర్తిగా కొత్త నటీనటులతో తెరకెక్కించినప్పటికీ, వారంతా ఎంతో మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ తమ పాత్రలకు బలాన్ని చేకూర్చారు. హర్షిత్ తన పాత్రలో నేచురల్ గా కనిపిస్తే.. శ్రీనివాస్, చరణ్ కామెడీ పంచ్ లతో అలరించారు.
శ్రియా కొంతం తన అందంతో పాటు సహజ నటనతో ఆకట్టుకుంది. శ్రీవల్లీ పాత్రలో భయభ్రాంతులకు లోనుచేస్తూనే కామెడీ టచ్ తోనూ ఆకట్టుకుంది. ఇంకా శ్రావణి లక్ష్మి, షాలిని కొండెపూడి తమ పాత్రలకు న్యాయం చేశారు.ఫైనల్ గా సమంత అతిథి పాత్రలో అదరగొట్టింది.
ఈ చిత్రం టెక్నికల్ గా హై స్టాండార్డ్ లో ఉంది. ప్రతి విభాగంలోనూ నాణ్యత కనిపిస్తుంది. పాటలు, నేపథ్య సంగీతం బాగా కుదిరాయి. విజువల్స్ పరంగా సినిమాకు ఓ ప్రత్యేకమైన స్థాయి కనిపించింది. సమంత నిర్మాణ విలువలు కూడా కథకు తగినట్టుగా కనిపించాయి.
చివరగా
భయపెడుతూ నవ్వించే 'శుభం'
Telugu70mm Rating: 2.75/5
-
Home
-
Menu