‘సారంగపాణి జాతకం‘ సినిమా రివ్యూ

‘సారంగపాణి జాతకం‘ సినిమా రివ్యూ
నటీనటులు: ప్రియదర్శి, రూప కొడువాయూర్, వీకే నరేశ్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, హర్ష చెముడు తదితరులు
సినిమాటోగ్రఫీ: పీజీ విందా
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్ ( శ్రీదేవి మూవీస్)
దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ
విడుదల తేది: 25-04-2025
'కోర్ట్' మూవీతో బడా హిట్ అందుకున్నాడు ప్రియదర్శి. ఇదే ఊపులో ఇప్పుడు 'సారంగపాణి జాతకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే 'కోర్ట్' ఆద్యంతం సీరియస్ టోన్ లో ఉంటే.. 'సారంగపాణి జాతకం' ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘సారంగపాణి జాతకం‘ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ
సారంగ (ప్రియదర్శి) ఓ కార్ల షోరూమ్‌లో సేల్స్‌మన్‌గా పని చేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి చదువులో యావరేజ్ అయిన సారంగ కి ఆ ఉద్యోగం సాధించడమే పెద్ద విజయం అని భావిస్తారు తల్లదండ్రులు. అందుకే అతని జాతకమే కారణమని నమ్ముతుంటారు. ఈ నమ్మకంతో సారంగకూ జాతకాలపై గాఢమైన విశ్వాసం ఏర్పడుతుంది.
ఇంతలో అతని కంపెనీలో మేనేజర్‌గా పని చేసే మైథిలి (రూప కొడువాయూర్)తో ప్రేమలో పడతాడు. ప్రేమ చెప్పే ముందు మైథిలీనే ముందుగా తనకూ సారంగపాణిని ఇష్టమని అంటుంది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమవుతారు.
అయితే పెళ్లి ముందర సారంగకు జాతకాలను బాగా చూసే జిగ్గేశ్వర్ (అవసరాల శ్రీనివాస్) పరిచయమవుతాడు. అతని వద్ద చేతి రేఖలు చూపిస్తే, ఒక షాకింగ్ విషయం చెప్పి ఆందోళనకు గురిచేస్తాడు. ఆ పనిని పూర్తి చేయకపోతే పెళ్లి కుదరదని తెలుసుకున్న సారంగ, తన బెస్ట్‌ఫ్రెండ్ చందు (వెన్నెల కిశోర్) సహాయంతో ఒక స్కెచ్ వేసి ఆ పని జరగేలా ప్లాన్ చేస్తాడు.
ఆ పని ఏమిటి? సారంగ జీవితాన్ని మార్చే ఆ జాతక రహస్యం ఏంటి? అతని ప్రణాళికలు ఫలించాయా? చివరకు మైథిలితో వివాహం జరిగిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘సారంగపాణి జాతకం’ తప్పక చూడాల్సిందే!
విశ్లేషణ
ప్రియదర్శి అంటేనే కామెడీ స్టార్. కానీ ఇటీవల కాలంలో కన్నీళ్లకి కూడా బాసటగా మారాడు. ‘బలగం, కోర్ట్‘ వంటి సినిమాలతో భావోద్వేగం పండించాడు. అయితే ఈసారి మాత్రం ‘సారంగపాణి జాతకం‘లో తన కామెడీని పండించాడు.
జాతకాలను నమ్మే ఒక యువకుడు, అనుకోని చిక్కుల్లో ఇరుక్కోవడం, వాటినుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు... వినడానికి చిన్నగా అనిపించినా, స్క్రీన్ మీద ఇది పక్కా ఫన్ రైడ్.
భారతీయ సాంప్రదాయంలో జాతకాల పట్ల ఉన్న గాఢమైన నమ్మకాన్ని కేంద్రంగా చేసుకుని, మోహనకృష్ణ ఇంద్రగంటి ఓ వినూత్నమైన కామెడీ కథను తెరపైకి తీసుకొచ్చాడు. ఫస్ట్ హాఫ్‌లో లవ్, కామెడీ, సున్నితమైన అడల్ట్ జోక్స్‌తో ప్రేక్షకులను నాన్ స్టాప్ గా నవ్వించడంలో దర్శకుడు విజయం సాధించాడు.
కథను సాగదీయకుండా ప్రతి సీన్‌లో పంచ్‌లు, ప్రాసలు ఉంచడం ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ తో కథలో ఓ మలుపు ఇచ్చి ఆసక్తిని మరింత పెంచుతుంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది వెన్నెల కిషోర్, ప్రియదర్శి కాంబినేషన్. ఇద్దరి మధ్య డైలాగ్స్, టైమింగ్… ప్రేక్షకుల్ని ఓ రేంజ్‌లో అలరిస్తాయి.
సెకండాఫ్‌లో వైవా హర్ష ఎంట్రీతో ఫన్ ఇంకొంచెం హై లెవెల్ లో ఉంటుంది. తనికెళ్ల భరణి పాత్ర కూడా కథలో కొత్తదనాన్ని తీసుకొచ్చింది. కథ చిన్నపాటి లూప్‌ల్లో తిరిగినట్టు అనిపించినా ఎక్కడా బోరింగ్ అనిపించదు. హోటల్ నేపథ్యంగా వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. చివరికి సీరియస్ సీన్లలోనూ నవ్వులు రప్పించడం ఇంద్రగంటి స్టైల్‌కు మచ్చుతునకగా నిలిచింది.
కొన్నిచోట్ల సంభాషణలు ఘాటు పదాలను ఉపయోగించినా, మొత్తం సినిమాలో హాస్యమే ప్రధానంగా నిలవడంతో ప్రేక్షకులు పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు. మొత్తంగా "జాతకం" అనే సీరియస్ కాన్సెప్ట్‌ను వినోదాత్మక కోణంలో చూపిస్తూ, దర్శకుడు ఇచ్చిన ట్రీట్మెంట్ యూనిక్‌గా నిలిచింది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
ప్రియదర్శి ఎప్పటిలానే తన సహజమైన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. సీరియస్ క్యారెక్టర్ అయినా, ఎంటర్‌టైనింగ్ గా అలరించాడు. తెలుగమ్మాయి రూప తన అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. వెన్నెల కిశోర్, అవసరాల శ్రీనివాస్, హర్ష చెముడు, తనికెళ్ల భరణిలు తమ తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
సాంకేతికంగా వివేక్ సాగర్ నేపథ్య సంగీతం కథానుగుణంగా బాగుంది. పీజీ విందా సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన విజువల్స్ బాగున్నాయి. మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ సమర్థంగా ఉన్నప్పటికీ, కొన్ని సన్నివేశాలు మరింత క్రిస్ప్‌గా ఉండాల్సిన అవసరం కనిపించింది. నిర్మాణ విలువల విషయానికొస్తే, శ్రీదేవి మూవీస్ సంస్థ నుంచి ఊహించినట్లుగానే సినిమాలో మంచి క్వాలిటీ కనిపించింది.
చివరగా
‘కోర్ట్‘ సినిమా తర్వాత "ప్రియదర్శి" ఇంద్రగంటి స్టైల్ కామెడీతో బాగా నవ్వించాడు. ఫస్ట్ హాఫ్ వెన్నెల కిషోర్, సెకండ్ హాఫ్ వైవా హర్ష కామెడీ టైమింగ్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. సరదాగా ఫ్యామిలీతో థియేటర్ కి వెళ్లి చూసే సినిమా.
Telugu 70 MM Rating: 3.25 / 5
-
Home
-
Menu