రజనీ క్రేజ్‌కి సరిహద్దులు లేవు!

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన భారీ మల్టీస్టారర్ ‘కూలీ’ విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. నాగార్జున అక్కినేని, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్ వంటి తారలతో కూడిన ఈ క్రేజీ కాంబినేషన్‌పై మొదటి నుంచే అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, అనిరుధ్ మ్యూజిక్ సినిమాపై హైప్‌ను తారాస్థాయికి చేర్చేశాయి. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.
సినిమా విడుదలకు ముందు పైరసీని అరికట్టేందుకు మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సన్ టీవీ నెట్‌వర్క్ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి, దేశవ్యాప్తంగా 36 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ‘కూలీ’ పైరసీ కంటెంట్ ఉన్న వెబ్‌సైట్లను తక్షణం బ్లాక్ చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో కొత్తగా పుట్టుకొచ్చే పైరసీ వెబ్‌సైట్లు కూడా ఈ నిషేధానికి లోబడి ఉంటాయని స్పష్టం చేశారు.
రజనీ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పే సంఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. అక్కడి ఒక కంపెనీ తమ తమిళ ఉద్యోగులకు సినిమా విడుదల రోజు పెయిడ్ హాలిడే ప్రకటించింది. అంతేకాదు, ఫస్ట్ షో టికెట్లు, తినుబండారాల ఖర్చులకు 30 సింగపూర్ డాలర్లు అందజేస్తామని కూడా తెలిపింది. ఉద్యోగుల సంక్షేమం, స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌లో భాగమని ఆ సంస్థ తెలిపిన ఈ నోటీసు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలుగులో రజనీకి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈసారి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం, నాగార్జున విలన్ పాత్ర, ఉపేంద్ర ప్రత్యేక పాత్ర, అమీర్ అతిథి పాత్ర వంటి అంశాలు ‘కూలీ’పై ఆసక్తిని మరింత పెంచాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికేట్ జారీ చేయడం కొంతమంది అభిమానుల్లో సందేహాలను రేపింది. రజనీ సినిమాలకు కుటుంబ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వచ్చే పరిస్థితిలో ఈ సర్టిఫికేట్ కలిగించే ప్రభావం ఏమిటన్నది చూడాలి.
-
Home
-
Menu