'కాంతార 3'లో ఎన్టీఆర్?

సూపర్ హిట్ 'కాంతార'కి ఇప్పుడు ప్రీక్వెల్ రూపొందిస్తున్నాడు డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి. ఈ సిరీస్ లో థర్డ్ పార్ట్ కూడా ఉండనుందట. దీంతో 'కాంతార 3'లో ఎన్టీఆర్ నటిస్తాడనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ కాంబోపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నా, ప్రస్తుతానికి ఈ వార్తల్లో నిజం లేదనే సంకేతాలందుతున్నాయి. తారక్, రిషబ్ మధ్య స్నేహం ఉన్నా, కలిసి చేసే సినిమా ప్రతిపాదన ఇప్పట్లో లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మొదటగా హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన ‘వార్ 2’ ఆగస్టు 14న విడుదల కానుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’, 2026లో ‘దేవర 2’, తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం ఎన్టీఆర్ కిట్టీలో ఉన్నాయి. వీటితో పాటు 'జైలర్' డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తి చేయడానికి కనీసం మూడు, నాలుగేళ్ల సమయం పడుతుంది. ఈనేపథ్యంలో ‘కాంతార 3’కు తారక్ సమయం కేటాయించే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తానికి, తారక్ – రిషబ్ కలయికపై గాసిప్స్ ఊపందుకున్నా, ప్రస్తుత షెడ్యూల్స్ ప్రకారం వీరిద్దరూ కలిసి చేసే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ 'కాంతార 3'లో అతిథి పాత్ర రూపంలో అయినా తారక్ కనిపిస్తే మాత్రం ఇది ఎన్టీఆర్-రిషబ్ ఫ్యాన్స్ ఇద్దరికీ పండుగే.
-
Home
-
Menu