'మయసభ' రివ్యూ

నటీనటులు: ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయి కుమార్, దివ్య దత్తా, తాన్య రవిచంద్రన్, రవీంద్ర విజయ్, శత్రు తదితరులు
సినిమాటోగ్రఫీ: సురేష్ రగుటు, జ్ఞానశేఖర్ వి.ఎస్
సంగీతం: శక్తికాంత్ కార్తిక్
ఎడిటింగ్ : ప్రవీణ్ కె.ఎల్
నిర్మాతలు: జయ్ కృష్ణ, లింగమనేని, శ్రీ హర్ష
దర్శకత్వం: దేవా కట్టా, కిరణ్ జేయ్ కుమార్
విడుదల తేది: ఆగస్టు 07, 2025 (సోనీ లివ్)
పొలిటికల్ థ్రిల్లర్స్ ను తెరకెక్కించడంలో దేవా కట్టాది ప్రత్యేకమైన శైలి. ఈకోవలోనే లేటెస్ట్ గా 'మయసభ' అంటూ ఓ వెబ్ సిరీస్ ను తీసుకొచ్చాడు. సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతున్న 'మయసభ' ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
రాయలసీమ నేపథ్యంతో రూపొందిన 'మయసభ' వెబ్ సీరిస్, రెండు విభిన్న దారుల్లో పెరిగిన యువకుల రాజకీయ ప్రయాణాన్ని చూపిస్తుంది. ఎం.ఎస్.ఆర్. (చైతన్యరావ్) ఒక ఫ్యాక్షన్ కుటుంబానికి చెందినవాడిగా డాక్టరుగా స్థిరపడుతాడు. కె.కె.ఎన్. (ఆది పినిశెట్టి) రైతు కుటుంబం నుంచి వస్తాడు. కాలేజీ రోజులలో స్నేహితులైన ఈ ఇద్దరికి, తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఆశయం కలుగుతుంది.
అయితే వారి కులాలు వేరు, నమ్మకాలు భిన్నం, భావజాలాలు కూడా విభిన్నమైనవి. అయినా వారి ఉద్దేశ్యం మాత్రం సమాజ సేవే. వీరిద్దరూ ప్రజల మద్దతుతో ఎదుగుతారు, నేతలుగా నిలదొక్కుకుంటారు. ఎమర్జెన్సీ తర్వాత దేశంలో ఎన్నికలు జరుగుతుండగా, వీరిద్దరూ పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే శాసనసభకు ఎన్నికవుతారు.
అంతా ఇక్కడితో ముగిసిపోతుందా అనుకుంటే, కథలోకి ఎంటర్ అవుతాడు – రాయపాటి చక్రధర్ రావు (RCR) (సాయికుమార్). అసాధారణమైన పొలిటికల్ ఎంట్రీతో, ప్రజల దృష్టిని ఆకర్షించిన ఈ కొత్త నాయకుడు ఎందుకు రాజకీయాల్లోకి వస్తాడు? అతని వెనుక ఉన్న డ్రైవ్ ఏమిటి? అతనికి KKN, MSRలతో ఉన్న సంబంధం ఏంటి? అనేది మయసభ వెబ్ సిరీస్.
విశ్లేషణ
దర్శకుడు దేవ కట్టా తెరకెక్కించిన ఈ వెబ్ సీరిస్, ప్రముఖ తెలుగు రాజకీయ నాయకులు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు జీవితాలను ఆధారంగా తీసుకుని రూపొందించారని స్పష్టంగా తెలుస్తుంది. 1970ల నాటి ఏపీ రాజకీయ నేపథ్యం, అప్పటి కుల రాజకీయాలు, ఫ్యాక్షన్ గొడవలను ఇందులో ఆవిష్కరించాడు.
రాజకీయాలు ప్రజల జీవితాల్లో భాగమైనప్పటికీ, వాటిని తెరపై కథగా మార్చడం సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే, ఇందులో వాస్తవాన్ని మించే డ్రామా ఉండకూడదు. వాస్తవాలను ఆధారంగా తీసుకున్నా చాలా వరకూ కల్పిత కథతో ఈ సిరీస్ ను రూపొందించాడు దేవా కట్టా.
అసలు రాజకీయాలపై అవగాహన లేని వారు ఈ కథను నిజంగా జరిగినట్లు నమ్మే అవకాశం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ప్రత్యక్షంగా అనుభవించినవారు, ఇందులోని పాక్షికతను వెంటనే గుర్తించగలరు. ఫలితంగా, తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్ర విమర్శలు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడ ప్రశ్నలు రావడం అసాధ్యమేమీ కాదు.
ముఖ్యంగా భారతదేశం మీద ఎమర్జెన్సీ విధించిన సందర్భాన్ని చూపించే సన్నివేశాలు ఎలాంటి ఉత్కంఠను రేకెత్తించేలా లేవు. ఇకపోతే, కొన్ని హింసాత్మక సన్నివేశాలు, బోల్డ్ డైలాగులు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు అంతగా కనెక్ట్ కావు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
ఇందులో చంద్రబాబును పోలిన పాత్రలో ఆది పినిశెట్టి, వైయస్ఆర్‌ను తలపించే పాత్రలో చైతన్యరావ్ కనిపించారు. ఎన్టీఆర్ జ్ఞాపకం వచ్చేలా సాయికుమార్ ఓ కీలక పాత్ర పోషించారు. ఇతర పాత్రల్లో తాన్య రవిచంద్రన్, శత్రు, రవీంద్ర విజయ్, శ్రీకాంత్ భరత్, దివ్యాదత్తా, రఘుబాబు, భావన వళపండల్, చరిత వర్మ, మేకా రామకృష్ణ, సురభి ప్రభావతి, రూపలక్ష్మీ తదితరులు కనిపించారు.
కృష్ణమనాయుడిగా ఆది పినిశెట్టి, రామి రెడ్డిగా చైతన్య రావు పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, పాత్రల పరస్పర బలాబలాలు తెరపై ఎంతో సహజంగా కనిపించాయి. ఎన్టీఆర్ ను పోలిన పాత్రలో సాయికుమార్ జీవించాడు. ఆయన డైలాగ్ డెలివరీ ఈ పాత్రను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. ‘మేడమ్’ పాత్రలో దివ్య దత్తా నటన ప్రత్యేకంగా నిలిచింది.
ఎలాంటి పక్షపాతానికి లోనుకాకుండా అన్ని పాత్రల్ని సమతుల్యంగా తెరకెక్కిస్తూ 'మయసభ'ను తీర్చిదిద్దడంలో దేవా కట్టా మార్కులు కొట్టాడు. అయితే, కొన్ని సందర్భాల్లో రైటింగ్ మరింత శక్తివంతంగా ఉండాల్సిందనే అభిప్రాయం కలుగుతుంది. ముఖ్యంగా మధ్యలో వచ్చే కొన్ని ఎపిసోడ్స్ లో గ్రిప్ తగ్గినట్టు అనిపిస్తుంది.
జ్ఞానశేఖర్ వి.ఎస్., సురేష్ రగుటు సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ పీరియాడిక్ స్టోరీకి తగినట్టు ఆర్ట్ డిజైన్ కుదిరింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయానికొస్తే, శక్తికాంత్ కార్తిక్ స్కోర్ సీన్స్‌కి ఎమోషనల్ డెప్త్ ఇచ్చింది. నిర్మాణ విలువల పరంగా కూడా సిరీస్ ప్రమాణాలు తగ్గలేదు. ప్రతి ఫ్రేమ్‌లో కూడా టీమ్ పెట్టిన కష్టాన్ని చూడొచ్చు.
చివరగా
మొత్తానికి, 'మయసభ'లో ఆసక్తికర అంశాలు ఉన్నప్పటికీ, రచనలోని లోపాలు, నెమ్మదిగా సాగిన కథనం ఈ సిరీస్‌ను పూర్తిగా ఆకట్టుకునేలా చేయలేకపోయాయి.
-
Home
-
Menu