300 కోట్ల క్లబ్‌లో 'మహావతార్'

300 కోట్ల క్లబ్‌లో మహావతార్
X
హాలీవుడ్‌లో ఉన్నంత క్రేజ్‌ మన దగ్గర యానిమేషన్‌ సినిమాలకు ఎప్పుడూ లేదు. నటుల్లేని సినిమా, వీఎఫ్‌ఎక్స్‌ ఆధారిత చిత్రం అంటే అది పిల్లల కోసమే అన్న అభిప్రాయం ఎక్కువ. కానీ ఆ అభిప్రాయాన్ని పూర్తిగా చెరిపేసింది ‘మహావతార్‌ నరసింహ’.

హాలీవుడ్‌లో ఉన్నంత క్రేజ్‌ మన దగ్గర యానిమేషన్‌ సినిమాలకు ఎప్పుడూ లేదు. నటుల్లేని సినిమా, వీఎఫ్‌ఎక్స్‌ ఆధారిత చిత్రం అంటే అది పిల్లల కోసమే అన్న అభిప్రాయం ఎక్కువ. కానీ ఆ అభిప్రాయాన్ని పూర్తిగా చెరిపేసింది ‘మహావతార్‌ నరసింహ’. ప్రమోషన్స్‌ లేకపోయినా మౌత్‌టాక్‌తోనే ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు కలెక్షన్ల పరంగా కొత్త చరిత్ర రాసింది.

ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేషన్‌ చిత్రంగా 'మహావతార్‌ నరసింహ' ఇప్పటికే రికార్డు సృష్టించింది. తాజాగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్ల గ్రాస్‌ మార్క్‌ను దాటిందని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ ప్రకటించింది.

జులై 25న విడుదలైన ఈ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్‌ టాక్‌ను తెచ్చుకుంది. 'సాక్షాత్తూ నరసింహ స్వామే ప్రత్యక్షమయ్యాడా?" అన్నంత సహజంగా కనిపించిన విజువల్స్‌తో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఇక్కడ విజయం సాధించిన వెంటనే విదేశాల్లో రిలీజ్‌ చేయగా అక్కడ కూడా బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో దూసుకెళ్లింది.

పెద్ద స్టార్ల సినిమాలు థియేటర్ల నుంచి తీసేస్తున్న పరిస్థితుల్లో కూడా 'మహావతార్‌ నరసింహ' విడుదలై 30 రోజులు దాటినా పలు కేంద్రాల్లో హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో కొనసాగుతోంది. ఇప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు రావడం విశేషం. ఇకపై 'మహావతార్‌' సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా మరో ఆరు సినిమాలు సిద్ధమవుతున్నాయి. రెండు సంవత్సరాలకొకటి చొప్పున రిలీజ్‌ చేయాలనే ప్రణాళికలో చిత్రబృందం ముందుకు సాగుతోంది.



Tags

Next Story