'మదరాసి' రివ్యూ

మదరాసి రివ్యూ
X
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా సీనియర్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం 'మదరాసి'. ఈ మూవీలో శివకార్తికేయన్ కి జోడీగా రుక్మిణి వసంత్ నటించగా.. బాలీవుడ్ స్టార్ జమ్వాల్ విలన్‌గా నటించాడు.

నటీనటులు: శివకార్తికేయన్‌, రుక్మిణి వసంత్‌, విద్యుత్‌ జమ్వాల్‌, బిజు మేనన్‌, విక్రాంత్‌

సినిమాటోగ్రఫీ: సుదీప్‌ ఎల్మోన్‌

సంగీతం: అనిరుధ్‌

ఎడిటింగ్ : శ్రీకర్‌ ప్రసాద్‌

నిర్మాత: ఎన్‌.శ్రీలక్ష్మీ ప్రసాద్‌

దర్శకత్వం: ఏఆర్‌ మురుగదాస్‌

విడుదల తేది: సెప్టెంబర్ 5, 2025

కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా సీనియర్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం 'మదరాసి'. ఈ మూవీలో శివకార్తికేయన్ కి జోడీగా రుక్మిణి వసంత్ నటించగా.. బాలీవుడ్ స్టార్ జమ్వాల్ విలన్‌గా నటించాడు. శ్రీ లక్ష్మి మూవీస్ బ్యానర్‌పై ఎన్. శ్రీలక్ష్మి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు ఆడియన్స్ ముందుకొచ్చిన 'మదరాసి' ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ

తమిళనాడులో తుపాకీ స్మగ్లింగ్‌తో విధ్వంసం సృష్టించాలని ఓ సిండికేట్ పన్నాగం పన్నుతుంది. విరాట్ (విద్యుత్ జమ్వాల్), చిరాగ్ (షబీర్ కల్లరక్కల్) అనే స్నేహితులు భారీ స్థాయిలో ఆయుధాల రవాణా చేస్తారు. ఈ ప్లాన్ గురించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కి సమాచారం చేరుతుంది. ఎన్‌.ఐ.ఏ చీఫ్ ప్రేమ్‌నాథ్‌ (బిజు మేనన్‌) ఈ ఆపరేషన్‌కి శ్రీకారం చుడతాడు.

ఇక రఘురామ్‌ (శివకార్తికేయన్‌) జీవితంలో ఘోర ప్రమాదం అతని కుటుంబాన్ని కబళిస్తుంది. ఆ షాక్‌తో మానసిక సమస్యలు ఎదుర్కొన్న రఘు, ఆత్మహత్యకు కూడా ప్రయత్నిస్తాడు. అప్పుడు ప్రేమ్‌నాథ్‌ అతనిని కలుసుకొని, ప్రాణాల్ని లెక్క చేయని అతన్ని ఈ మిషన్‌లో భాగస్వామ్యం చేస్తాడు.

ఈ క్రమంలో రఘు – మాలతి (రుక్మిణి వసంత్‌) ప్రేమకథ సాగుతుంది. కానీ అనుకోని పరిణామాలతో వారిద్దరి సంబంధం దెబ్బతింటుంది. ఇంతలోనే గన్ స్మగ్లింగ్ మాఫియాను అడ్డుకోవడానికి రఘు పావుగా మారతాడు. చివరికి ఈ ఆపరేషన్ విజయవంతమైందా? రఘు తన ప్రేమను తిరిగి సాధించాడా? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ

సామాజిక అంశాలను కమర్షియల్‌గా చూపించడంలో మురుగదాస్ దిట్ట. కాని కొన్నేళ్లుగా సిల్వర్ స్క్రీన్ పై అతని మ్యాజిక్ పనిచేయడం లేదు. ఇప్పుడు 'మదరాసి' విషయానికొస్తే.. తుపాకీ సిండికేట్‌ను అడ్డుకునే హీరో (శివకార్తికేయన్) చుట్టూ కథ నడుస్తుంది. అతనికి ఉన్న మానసిక సమస్య, తమిళనాడులో గన్ కల్చర్ పెంచాలనుకునే మాఫియా సెటప్ ప్రధానాంశాలు.

ఫస్టాఫ్ థ్రిల్లింగ్‌గా సాగుతుంది. హీరో-హీరోయిన్ల ట్రాక్ కూడా ఫీల్‌గుడ్‌గా ఉంటుంది. కానీ సెకండాఫ్ లో కథ ముందుకు కదలని ఫీలింగ్ కలుగుతుంది. రిపిటేటివ్ సీన్లు, లాజిక్‌లెస్ ఎపిసోడ్స్ వల్ల సినిమా కొన్ని చోట్ల బోర్ కలిగిస్తుంది. అయితే.. కొన్ని యాక్షన్ బ్లాక్స్, ఎమోషనల్ సీన్లు వర్కవుట్ అయ్యాయి. విలన్ పాత్ర బలం తగ్గిపోవడం.. పాటలు, రొమాంటిక్ ట్రాక్‌లో లోపాలుండటం.. కథలో కొత్తదనం లేకపోవడం వంటివి ఈ సినిమాకి మైనస్ పాయింట్స్.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

రఘురామ్ పాత్రలో శివకార్తీకేయన్ మరోసారి తన వెర్సటాలిటీని ప్రదర్శించాడు. మానసిక సమస్యలతో బాధపడే యువకుడిగా తన నటనలో వేరియేషన్స్ చూపించాడు. ము్యంగా యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు. హీరోయిన్ రుక్మిణి వసంత్ గ్లామర్, నటనతో ఆకట్టుకుంది. విద్యుత్ జమ్వాల్, షబీర్ విలన్లుగా బాగానే చేశారు. బిజు మీనన్ పాత్రకు స్కోప్ తక్కువ.

టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అనిరుధ్ సంగీతం డీసెంట్‌గా ఉన్నా, స్ట్రాంగ్ సీన్స్ లేకపోవడంతో నెక్ట్స్ లెవెల్ ఇంపాక్ట్ రాలేదు. సినిమా నిడివి కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. మాస్, కమర్షియల్ టచ్‌తో యాక్షన్ డ్రామాగా 'మదరాసి'ని తెరకెక్కించాడు మురుగదాస్. కానీ కథనం బలహీనంగా ఉండటంతో మురుగదాస్ మార్క్ అంతగా కనిపించలేదు.

చివరగా

'మదరాసి'.. శివ కార్తికేయన్ మాస్ షో

Tags

Next Story