
'కిష్కింధపురి' రివ్యూ

నటీనటులు: బెల్లకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సినిమాటోగ్రఫీ: చిన్మయ్ సలాస్కర్
సంగీతం: చైతన్ భరద్వాజ్
ఎడిటింగ్ : నిరంజన్ దేవరమనే
నిర్మాత: సాహు గారపాటి
దర్శకత్వం: కౌశిక్ పెగళ్లపాటి
విడుదల తేది: సెప్టెంబర్ 12, 2025
మాస్, యాక్షన్, హై బడ్జెట్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచే బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి ‘కిష్కింధపురి‘ అంటూ ప్రేక్షకుల ముందుకు ఒక కొత్త జోనర్‌లో వచ్చాడు. ఈ చిత్రంలో బెల్లంకొండకి జోడీగా అనుపమ నటించింది. కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది. మరి.. ఈ చిత్రం ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైథిలి (అనుపమా పరమేశ్వరన్) ప్రేమించుకుంటారు. వీరితో పాటు మరో స్నేహితుడు (సుదర్శన్) ఉంటాడు. ఈ ముగ్గురు కలిసి 'ఘోస్ట్ రైడ్ టూర్స్' అనే కాన్సెప్ట్ నడుపుతుంటారు. దెయ్యాలు ఉన్నట్టుగా చూపించి, పాడుబడిన బంగ్లాల్లోకి తీసుకెళ్లి థ్రిల్ పంచడమే వారి బిజినెస్.
ఒకసారి 11 మందితో కలిసి కిష్కిందపురి దగ్గరలోని పాడుబడిన సువర్ణమాయ రేడియో స్టేషన్‌కి వెళ్తారు. 1989లో మూతపడిన ఆ స్టేషన్‌కి అడుగు పెట్టగానే లోపల నుంచి ఓ భయానక వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ వారందరినీ చంపేస్తానని హెచ్చరిస్తుంది. చెప్పినట్టుగానే స్టేషన్‌లోకి వెళ్లిన ఇద్దరు లోకో పైలట్లు (భద్రం, శ్రీకాంత్ అయ్యంగార్) చనిపోతారు. తర్వాత మరికొందరూ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతారు.
ఇది సాధారణ మాయ కాదని, నిజంగా ఓ ఆత్మ ఉందని రాఘవ్ గ్రహిస్తాడు. ఆ వాయిస్ వెనుక వేదవతి అనే మహిళ ఆత్మ ఉందని తెలుస్తుంది. ఆమె ఎందుకు ఆత్మగా మారింది? ఆ రేడియో స్టేషన్‌తో ఆమెకున్న సంబంధం ఏమిటి? అందులోకి వచ్చిన వారిని ఎందుకు చంపేస్తోంది? అన్న విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
హారర్ జానర్‌లో సినిమాలు రూపొందించేటప్పుడు అత్యంత కీలకంగా పనిచేసేది స్క్రీన్‌ప్లే. కిష్కింధపురి విషయంలో కూడా అదే వర్తించింది. దర్శకుడు 1989లో కిష్కింధపురి అనే ఊరి దగ్గర మూతబడిన సువర్ణ మాయ రేడియో స్టేషన్‌లో ఐదుగురు మరణాలతో కథ ప్రారంభించి, ప్రస్తుత కాలానికి లింక్ చేస్తూ ఘోస్ట్ రైడ్ టూర్ చేసే యువతీ యువకుల గుంపును కథలోకి తీసుకొచ్చాడు. మొదట్లో సరదాగా సాగిన రైడ్, తర్వాత భయానక వాతావరణంలోకి మలుస్తూ థ్రిల్లర్ టచ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు.
ఫస్ట్ హాఫ్‌లో సినిమా బాగా ఎంటర్టైన్ చేసింది. ముఖ్యంగా మొదటి పది నిమిషాలు ప్రేక్షకులను కుర్చీలో కట్టిపడేసేలా ఆకట్టుకుంటుంది. వింత శబ్ధాలు, రియలిస్టిక్ సౌండ్ ఎఫెక్ట్స్, రేసీ స్క్రీన్‌ప్లే బాగా పనిచేశాయి. ట్రైన్ సీన్, స్మశాన వాతావరణం హారర్ అనుభూతిని బలంగా ఇచ్చాయి.
ఇంటర్వెల్ తర్వాత కథలోకి వచ్చిన ఫ్లాష్‌బ్యాక్ మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు. దెయ్యం వెనక ఉన్న కథనం చాలా రొటీన్‌గా అనిపించడం సినిమాకు పెద్ద మైనస్. విశ్రవ పుత్ర పాత్రను సరిగ్గా డీల్ చేయకపోవడంతో ఆసక్తి తగ్గింది. తల్లి సెంటిమెంట్‌ను బలవంతంగా కలపడం కూడా కథను ట్రాక్ తప్పేలా చేసింది. అయితే క్లైమాక్స్‌లో వచ్చిన శ్రీరామ రక్ష సన్నివేశం మాత్రం గూస్‌బంప్స్ తెప్పించింది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త జానర్ లో అలరించాడు. అయితే.. బెల్లంకొండ మార్క్ యాక్షన్ మాసాలా ఎలిమెంట్స్ మాత్రం మిస్ అవ్వలేదు. రాఘవ్ పాత్రలో యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రత్యేకించి క్లైమాక్స్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మొదట్లో అందంగా కనిపిస్తూనే, ద్వితీయార్ధంలో భయపెట్టే ఘోస్ట్ పాత్రలో అదరగొట్టింది. ఆమె పెర్ఫామెన్స్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విశ్రవపుత్ర పాత్రలో డ్యాన్స్ మాస్టర్ శాండీ అద్భుతంగా నటించాడు. ఆయన కనిపించే విధానమే భయపెడుతుంది. హైపర్ ఆది తనదైన పంచ్‌లతో నవ్వించాడు. సుదర్శన్, భద్రమ్, శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సీనియర్ నటి ప్రేమ తల్లి పాత్రలో సహజంగా నటించి సినిమాకు బలాన్ని ఇచ్చింది.
సాంకేతికంగా సినిమా బలంగా ఉంది. చేతన్ భరద్వాజ్ అందించిన BGM హారర్ సీన్స్‌లో భయాన్ని రెట్టింపు చేసింది. అయితే పాటల పరంగా ఆకట్టుకునే ట్రాక్ లేకపోవడం మైనస్. సినిమాటోగ్రాఫర్ చిన్మయ్ సాలస్కర్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. నిర్మాత సాహు గారపాటి నిర్మాణ విలువల్లో రాజీపడలేదు.
చివరగా
'కిష్కింధపురి'.. ఆకట్టుకునే థ్రిల్లర్!
-
Home
-
Menu