'కాంతార: చాప్టర్-1' రివ్యూ

నటీనటులు: రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య తదితరులు
సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్.కశ్యప్
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
ఎడిటింగ్ : సురేష్
నిర్మాతలు: హోంబలే ఫిల్మ్స్
దర్శకత్వం: రిషబ్ శెట్టి
విడుదల తేది: అక్టోబర్ 2, 2025
దసరా స్పెషల్ గా ఈరోజు గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది ‘కాంతార చాప్టర్ 1‘. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ‘కాంతార.. చాప్టర్ 1‘ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ
‘కాంతార‘ మొదటి భాగంలో హీరో తండ్రి మాయం కావడం ఒక పెద్ద సస్పెన్స్‌గా మిగిలింది. ఆ రహస్యమే ‘కాంతార: చాప్టర్ 1‘ కథకు మూలం. ఈ కథ శతాబ్దాల క్రితం కడంబ రాజవంశ కాలంలో బనవాసి అడవుల్లో చోటుచేసుకున్న జానపద గాథలపై ఆధారపడి ఉంటుంది.
కథలో ప్రధానంగా మూడు తెగలు ఉంటాయి. ఈ మూడు తెగలకూ పింజర్ల దేవుడు కావాలని ఆశ ఉంటుంది. కాంతార తెగ తమ దేవుడిని కాపాడుకుంటూ ఉంటే, బంగ్రా తెగతో పాటు మరో తెగ కూడా ఆ దేవుడి విగ్రహాన్ని చేజిక్కించుకోవడానికి యుద్ధానికి దిగుతుంది.
కాంతార తెగకు కాపరి, నాయకుడిగా బర్మె (రిషబ్ శెట్టి) నిలుస్తాడు. ఆయన పుట్టుకలోనే ఒక దైవ రహస్యం దాగి ఉంటుంది. ఏ కష్టం వచ్చినా శివగణాలు వచ్చి అతడిని రక్షిస్తాయి. మరోవైపు బంగ్రా రాజవంశానికి చెందిన మహారాజు రాజశేఖర్ (జయరామ్), యువరాజు కులశేఖర్ (గుల్షన్ దేవయ్య), యువరాణి కనకవతి (రుక్మిణి వసంత్) కాంతార ప్రాంతంపై కన్నేస్తారు. సుగంధ ద్రవ్యాల వ్యాపారంపై అధిపత్యం కోసం కుట్రలు పన్నుతూ, కాంతార తెగ ఈశ్వర పూతోటలోకి ప్రవేశించాలనే యత్నం చేస్తారు.
ఈ పోరాటంలో బర్మె తన తెగను, తమ దేవుడిని, తమ హక్కులను ఎలా కాపాడుకున్నాడు? దేవుడి విగ్రహం చివరికి ఎవరి చేతికి దొరికింది? మహాశివుడు నిజంగా ప్రత్యక్షమయ్యాడా? అనే అంశాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
‘కాంతార’ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ‘కాంతార చాప్టర్ 1’ మొదలవుతుంది. కాంతార ప్రాంతం, ఈశ్వరుడి పూదోట, దైవిక బావి, పంజుర్లి మూలాలు వంటి రహస్యాలను ఈ ప్రీక్వెల్ లో చూపించారు. సినిమా తొలి 20 నిమిషాల్లో గిరిజన తెగల జీవన విధానం, రాజు అణచివేతలు ఆసక్తిగా చూపించగా, ఈశ్వర పూదోటలోని బావి సన్నివేశాలు థ్రిల్ కలిగిస్తాయి. హీరో సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి సిద్ధపడటం కథలో మలుపు.
ఇంటర్వెల్ లో టైగర్ సీక్వెన్స్, సెకండాఫ్ లో అసురజాతితో యుద్ధం, రిషబ్ చేసే రుద్ర తాండవం హైలైట్‌గా నిలుస్తాయి. భాంగ్రా యువరాజు కులశేఖర విధ్వంసం, కనకావతి పాత్రలో వచ్చే ట్విస్ట్ కథను ఎత్తుకు తీసుకెళ్తాయి. ప్రీక్లైమాక్స్‌లో హీరో గతం, బావితో ఉన్న సంబంధం థ్రిల్లింగ్‌గా చూపించారు. క్లైమాక్స్‌లో రిషబ్ విజృంభణ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. సినిమా చివర్లో ‘చాప్టర్ 2’కు లీడ్ ఇచ్చారు.
ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా మొదలైనా ఇంటర్వెల్ నుంచి వేగం పెరుగుతుంది. సెకండ్ హాఫ్‌లో వార్ సీక్వెన్స్‌లు, దేవుని కనెక్షన్‌లు ఆకట్టుకుంటాయి. అయితే తెగల పేర్లు, డబ్బింగ్‌లో తెలుగు నేటివిటీ తగ్గిపోవడంతో కొంత కనెక్ట్ అవ్వలేని ఫీల్ ఉంది. మొత్తానికి ‘కాంతార చాప్టర్ 1’ మొదటి భాగం మాదిరి రియలిస్టిక్ ఫీల్ లేకపోయినా, థ్రిల్లింగ్ యాక్షన్, దైవిక ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుడిని ఆకట్టుకునే డీసెంట్ సీక్వెల్ అని చెప్పొచ్చు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
‘కాంతార చాప్టర్ 1’ పూర్తిగా రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో. దర్శకుడిగా ఆయన అల్లుకున్న కథకు నటుడిగా తెరపై జీవం పోశాడు. రుక్మిణి వసంత్ కనకావతి పాత్రలో సర్‌ప్రైజ్ ప్యాకేజ్‌గా నిలిచింది. జయరాం మహారాజుగా ఆకట్టుకున్నాడు. యువరాజు పాత్రలో గుల్షన్ దేవయ్య నటన బాగుంది.
టెక్నికల్ గా చూసుకుంటే అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఆత్మలా నిలిచింది. క్లైమాక్స్, ప్రీక్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన మ్యూజిక్ ప్రత్యేక హైలైట్. అడవిలోని విజువల్స్ ను సినిమాటోగ్రాఫర్ బాగా చూపించాడు. ఎడిటింగ్‌లో కొన్ని సన్నివేశాలు తగ్గించి ఉంటే పేస్ మరింత బావుండేది.
చివరగా
‘కాంతార చాప్టర్ 1‘.. ఫర్వాలేదనిపించే ప్రీక్వెల్
-
Home
-
Menu