'కన్నప్ప' మూవీ రివ్యూ

నటీనటులు: విష్ణు మంచు, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్
సినిమాటోగ్రఫీ: షెల్డన్ చావ్
సంగీతం: స్టీఫెన్ దేవస్సీ
ఎడిటింగ్ : ఆంథోనీ
నిర్మాత: మోహన్ బాబు
దర్శకత్వం: ముఖేష్ కుమార్ సింగ్
విడుదల తేది: జూన్ 27, 2025
శివ భక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందిన మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘కన్నప్ప’. మంచు విష్ణు హీరోగా నటించి, ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన చిత్రమిది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈరోజు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ‘కన్నప్ప‘ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ
స్వర్ణముఖి నది తీరాన దట్టమైన అడవుల మధ్య ఐదు తెగలు జీవిస్తుంటాయి. ఈ తెగలందరికీ ప్రత్యేకమైన సంస్కృతి, విధానాలు ఉంటాయి. వాటిలో ఒకటి నాధనాధుడి (శరత్ కుమార్) తెగ. ఈ తెగ అధిపతి కుమారుడు తిన్నడు (మంచు విష్ణు). తిన్నడుకి చిన్ననాటి చేదు సంఘటనల కారణంగా దేవుడంటే పడదు. అతడి గ్రామం తరచూ సమస్యల్లో చిక్కుకుంటుంటే.. వాటి పరిష్కారానికి మారమ్మ (ఐశ్వర్య భాస్కరన్) అనే సన్యాసినీ నరబలి సూచిస్తుంది. ఇది తిన్నడికి అభ్యంతరంగా అనిపించినా, తన తండ్రి నాథనాధుడు మాటకు గౌరవమిస్తాడు.
కాలం గడుస్తుంది. యుక్త వయసులోకి వచ్చిన తిన్నడు, శత్రు తెగకు చెందిన నెమలి (ప్రీతి ముకుందన్)ను చూసి, ప్రేమలో పడతాడు. కానీ అనుకోని మలుపుగా, వాయు లింగాన్ని దొంగిలించేందుకు వచ్చిన కాలాముఖుడి సైనికులతో తిన్నడికి ఘర్షణ జరుగుతుంది. ఆ పోరులో తిన్నడు, కాలాముఖుడి తమ్ముడిని హతమారుస్తాడు.
ఈ సంఘటనతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరతాయి. ప్రతీకార దాహంతో కాలాముఖుడు వేల మంది సైనికులతో ఐదు గూడాలపై దాడికి సిద్ధమవుతాడు. ముప్పును ఎదుర్కోవాలంటే ఐదు తెగలు ఒక్కటిగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే అన్ని తెగల నాయకులు కలిసి, వీరత్వం గల వ్యక్తి కావాలనే ఉద్దేశంతో తిన్నడిని నాయకునిగా ఎన్నుకుంటారు.
కానీ అతను నాస్తికుడని తెలిసిన వెంటనే, అతనిపై నమ్మకం కోల్పోయి బహిష్కరిస్తారు. ఈ సందర్భంలో తిన్నడు జీవన ప్రయాణంలో మలుపు తిప్పే సంఘటనలు ఎదుర్కొంటాడు. అదే సమయంలో వాయులింగాన్ని చూడాలన్న నెమలి కోరిక ఏమైంది? అతడు నాస్తికుడి నుండి భక్తుడిగా, కన్నప్పగా ఎలా మారాడు? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన 'కన్నప్ప' సినిమా ప్రారంభమైనప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే మల్టీ లాంగ్వేజ్ స్టార్ క్యాస్ట్‌తో సినిమాను మలిచారు. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి స్టార్‌లు ఇందులో కీలక పాత్రలు పోషించడం విశేషం.
ఈ చిత్రం పునాది స్థలపురాణం. శ్రీకాళహస్తి గుహ్య గాధను ఆధారంగా తీసుకుని ఓ కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లే ప్రయత్నం దర్శకుడు చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా తిన్నడు పాత్ర పరిచయం, ఐదు గూడాలను ఎస్టాబ్లిష్ చేయడం వంటి అంశాలతో నిండిపోయింది. దీంతో కథ కొంత నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది.
అయితే అసలు కథ సెకండ్ హాఫ్‌లో మొదలవుతుంది. నాస్తికుడైన తిన్నడు భక్తుడైన కన్నప్పగా మారే మార్గాన్ని తడపడకుండా చూపించారు. ముఖ్యంగా చివరి 40 నిమిషాల్లో ప్రభాస్ ఎంట్రీతో సినిమాకు బలం చేకూరింది. ఈ భాగం ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేసింది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
మంచు విష్ణు తన కెరీర్‌లో ఉత్తమ నటనను ఈ చిత్రంలో ప్రదర్శించాడు, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో అతని భావోద్వేగ నటన అద్భుతంగా ఉంది. ప్రభాస్ పాత్ర డిజైన్ చేసిన తీరు, అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకునేలా ఉంది. మోహన్ బాబు కనిపించిన ప్రతి సీన్‌లో తనదైన నటనతో స్క్రీన్‌ను డామినేట్ చేశారు. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ పార్వతిగా గౌరవప్రదంగా కనిపించారు.
దర్శకుడిగా ముఖేష్ కుమార్ సింగ్ తన టేకింగ్‌తో మెప్పించాడు. సినిమాటోగ్రఫీ మరో హైలైట్. లొకేషన్స్ అద్భుతంగా చిత్రీకరించబడ్డాయి. గ్రాఫిక్స్ విషయంలో మాత్రం మరింత కేర్ తీసుకుని ఉంటే ఇంకా ఇంపాక్ట్ పెరిగేది. నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్, భావోద్వేగ సన్నివేశాలను సంగీతం మరింత ఎలివేట్ చేసింది.
చివరగా
‘కన్నప్ప‘.. మెప్పించే మైథలాజికల్ మూవీ
Telugu70MM: 3.25 / 5
-
Home
-
Menu