బాక్సాఫీస్‌కి బ్రహ్మ – రాజమౌళి

ఇరవై ఐదేళ్ల క్రితం ఓ టెలివిజన్ సీరియల్‌తో ప్రారంభమైన ఓ కుర్రాడి సినిమా ప్రయాణం, నేడు ప్రపంచం దాకా విస్తరించింది. ఆ కుర్రాడు ఎవరో కాదు తెలుగు సినిమా గర్వకారణం, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి.
సాధారణమైన ఆరంభమే అయినా, ఆయనలోని అసాధారణమైన దృష్టి అప్పుటి నుంచే కనిపించింది. చిన్న తెరపై ‘శాంతినివాసం’ సీరియల్‌తో తన ప్రతిభను చూపించిన రాజమౌళి, తర్వాత రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ తో దర్శకుడిగా అడుగుపెట్టాడు. తొలి సినిమానే బ్లాక్‌బస్టర్ కావడం ఆయనకు ఉన్న విజన్‌కి తొలి సాక్ష్యం.
ఆ తర్వాత వచ్చిన ‘సింహాద్రి’ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ప్రేక్షకులు ఆయన మాస్ హ్యాండ్లింగ్‌కు ఫిదా అయ్యారు. ‘సై, ఛత్రపతి’ సినిమాలతో ఆయన కథనంలో టెక్నికల్ ఎడ్జ్ కనిపించింది. ముఖ్యంగా ‘ఛత్రపతి’లోని షార్క్ ఫైట్ సీన్ విమర్శలు తెచ్చుకున్నా, అదే విమర్శ ఆయనలోని క్రియేటివ్ ఫైర్‌ను మరింత రగిలించింది.
ఆ తర్వాత జక్కన్న తన సొంత ప్రపంచం సృష్టించడం మొదలుపెట్టాడు. ‘యమదొంగ, మగధీర’ సినిమాల ద్వారా విజువల్ గ్రాండియర్‌కు కొత్త నిర్వచనం ఇచ్చాడు. ‘మగధీర’ తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకెళ్లగా, ‘మర్యాద రామన్న’ ఆయన సింప్లిసిటీ, నేరేటివ్ వైవిధ్యాన్ని చూపించింది.
తర్వాత ‘ఈగ’తో రాజమౌళి అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. ఒక చిన్న ఈగతో ప్రపంచ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచాడు. విజువల్ ఎఫెక్ట్స్‌లో ఆయన పట్టు అప్పుడు మరింత బలపడింది. అదే టెక్నికల్ బ్రిలియన్స్ తర్వాత ‘బాహుబలి’ సిరీస్‌లో అద్భుతంగా ప్రతిఫలించింది. రెండు భాగాల ‘బాహుబలి’ కేవలం సినిమా కాదు.. అది భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిని తెచ్చిన విప్లవం.
‘ఆర్.ఆర్.ఆర్’ అయితే చరిత్రే. ఇద్దరు అగ్రహీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టింది. ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ వేదికపై భారతీయ సినిమాను నిలిపింది. ఆ క్షణంలో రాజమౌళి కేవలం తెలుగు దర్శకుడు కాదు, గ్లోబల్ ఫిల్మ్ మేకర్ గా మారిపోయాడు.
ప్రస్తుతం రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న SSMB29 ప్రపంచ సినిమా స్థాయిలో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా రాబోతుంది. ఈ సినిమాతో ప్రతి ఫ్రేమ్ లోనూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే కొత్త ప్రామాణికం సెట్ చేయబోతున్నాడట జక్కన్న.
మొత్తంగా.. ఇరవై ఐదేళ్ల ప్రయాణం, డజను సినిమాలు, కానీ ప్రతి సినిమా ఒక కొత్త పాఠం. రాజమౌళి సినిమాలు కేవలం వినోదం కాదు – అవి ఒక అనుభవం. ఆయన దృష్టి, క్రమశిక్షణ, ప్యాషన్ తెలుగు సినిమాను గ్లోబల్ మ్యాప్‌పై నిలబెట్టాయి. ఈ రోజు, దర్శకధీరుడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా తెలుగు70MM ఈ గ్లోబల్ ఫిల్మ్ మేకర్స్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తుంది.
-
Home
-
Menu