హ్యాపీ బర్త్‌డే కింగ్

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ ప్రయాణం మొదలెట్టిన నాగార్జున తొలినాళ్లలో కొద్దిగా తడబడినా, తరువాత వైవిధ్యమైన కథలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. రొమాంటిక్ హీరోగా, భక్తి చిత్రాల నటుడిగా, మాస్ హీరోగా, ఎక్స్‌పెరిమెంటల్ సినిమాలు చేసిన నటుడిగా – ఒక్కో దశలో తన కెరీర్‌ను కొత్త మలుపు తిప్పుకున్నాడు.
‘ఆఖరి పోరాటం’తో మొదటి విజయాన్ని అందుకున్న నాగ్, ‘జానకి రాముడు, విక్కీ దాదా’ విజయాల తర్వాత ‘గీతాంజలి’తో ప్రేమకథలకు కొత్త నిర్వచనం ఇచ్చాడు. వెంటనే వచ్చిన ‘శివ’ మాత్రం తెలుగు సినిమా గమనాన్నే మార్చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది.
తరువాత ‘అల్లరి అల్లుడు, హలో బ్రదర్, ఘరానా బుల్లోడు’తో మాస్ హీరోగా అలరించాడు. అదే సమయంలో ‘నిన్నే పెళ్లాడతా’తో కుటుంబ కథా చిత్రాలకు కొత్త దిశ చూపించాడు. ‘అన్నమయ్య’లో భక్తి పాత్రకు ప్రాణం పోసి తన నటనను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఆ తరువాత ‘శ్రీరామదాసు’లోనూ అదే స్థాయి మెప్పు పొందాడు.
2000లలో ‘సంతోషం, మన్మథుడు, శివమణి, మాస్’ వరుస విజయాలు సాధించి మరోసారి కెరీర్ పీక్‌కు చేరుకున్నాడు. తరువాత ‘మనం’ వంటి ప్రయోగాత్మక కుటుంబ చిత్రంతో తన స్థాయి ఏంటో చూపించాడు. తన గ్లామర్‌తో, ఎప్పటికప్పుడు మారుతున్న పాత్రలతో యువ హీరోలకే పోటీగా నిలిచాడు.
'సోగ్గాడే చిన్ని నాయనా' అంటూ నేటితరం కుర్రాకారుని సైతం తన పల్లెటూరి స్వాగ్ తో ఊపేసిన నాగ్.. 'బంగార్రాజు, నా సామిరంగ'లలోనూ అలాంటి తరహా పాత్రలతో అలరించాడు. ఇక.. ఈ ఏడాది నాగ్ కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైనది. ఇప్పటివరకూ హీరోగానే అలరించిన నాగార్జున ఈ సంవత్సరం క్యారెక్టర్ యాక్టర్ గా, విలన్ గా బిగ్ టర్న్ తీసుకున్నాడు.
ధనుష్ 'కుబేర'లో క్యారెక్టర్ లో అదరగొట్టిన కింగ్.. రజనీకాంత్ 'కూలీ' కోసం విలన్ అవతార మెత్తి అందరినీ అలరించాడు. ప్రస్తుతం తన వందో సినిమాకోసం సిద్ధమవుతున్నాడు కింగ్. మొత్తం మీద.. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా వచ్చినా, నాగార్జున తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయం సృష్టించుకున్న నటుడు. కొత్తవారిని ప్రోత్సహిస్తూ, తరతరాల ప్రేక్షకులను అలరిస్తూ, ఇప్పటికీ యంగ్ స్టర్స్‌కు పోటీ ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈరోజు నాగ్ బర్త్‌డే సందర్భంగా కింగ్ నాగార్జునకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తుంది తెలుగు 70 ఎమ్.ఎమ్.
-
Home
-
Menu