'ఘాటి' రివ్యూ

నటీనటులు: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్య రావు, రవింద్ర విజయ్, జగపతి బాబు, జాన్ విజయ్, రాజు సుందరం తదితరులు
సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి కాటసాని
సంగీతం: విద్యాసాగర్ నాగవెల్లి
ఎడిటింగ్ : చాణక్యరెడ్డి, వెంకట్ ఎన్ స్వామి
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
విడుదల తేది: సెప్టెంబర్ 5, 2025
స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన చిత్రం ‘ఘాటి‘. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్‌పై రాజీవ్ రెడ్డి – సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ రోజు విడుదలైంది. మరి.. ఈ సినిమా ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
ఆంధ్ర – ఒడిశా సరిహద్దు తూర్పు కనుమల్లో గంజాయి సాగు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. అక్కడి అడవుల్లో పుట్టే గంజాయి తరలించడం, స్మగ్లింగ్ చేయడం స్థానికుల జీవనాధారంగా మారుతుంది. ఆ గంజాయి తరలించే వారినే “ఘాటీలు” అని పిలుస్తారు.
శీలావతి (అనుష్క శెట్టి), ఆమె బావ దేశీ రాజు (విక్రమ్ ప్రభు) చిన్నప్పటినుంచి ఘాటీలుగా జీవిస్తూ ఉంటారు. కానీ దేశీ రాజు తండ్రి మరణంతో తల్లికి ఇచ్చిన మాట కోసం, గంజాయి వృత్తి మానేసి కొత్త జీవితాన్ని మొదలుపెడతాడు. శీలావతి బస్ కండక్టర్‌గా, దేశీ రాజు ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటారు.
ఇదిలా ఉంటే, ఆ ప్రాంతంలో గంజాయి మాఫియాను కాస్టాల నాయుడు (రవీంద్ర విజయ్), కుందుల నాయుడు (చైతన్య రావు) అన్నదమ్ములు నడుపుతుంటారు. కోట్ల రూపాయల వ్యాపారం, రాజకీయ – కార్పొరేట్ లింకులు, ప్రాణాలు బలిగొనే పరిస్థితులు.. ఇవన్నీ అక్కడి రోజువారీ కష్టాలు. ఈ అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్‌గా జగపతిబాబు ఎంటర్ అవుతాడు.
అయితే, గంజాయి వ్యాపారానికి దూరంగా ఉన్నట్టు కనిపించిన దేశీ రాజు, శీలావతి రహస్యంగా ఆ వ్యాపారానికి దగ్గరగానే ఉంటారు. ఇదే క్రమంలో దేశీ రాజును
హత్య చేస్తారు. తన బావ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా, ఘాటి వృత్తిలో బంధించబడ్డ తన ప్రాంత ప్రజలను విముక్తి కల్పించేందుకు అడుగులు వేస్తుంది శీలావతి. ఈ క్రమంలో ఆమె ఎలాంటి ప్రతిబంధకాలు ఎదుర్కొంది? నాయుడు బ్రదర్స్ అహంకారానికి శీలావతి ఎలా ముగింపు పలికింది? అన్నది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
తూర్పు కనుమల్లో గంజాయి సాగు, దాన్ని మాఫియాలు ఎలా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారనేది ‘ఘాటి’ సినిమా ప్రధాన నేపథ్యం. ఘాటీల అన్యాయాలు, అక్కడి ప్రజల బానిస జీవితం, గంజాయి వల్ల సమాజంలో జరుగుతున్న దుష్పరిణామాలను దర్శకుడు క్రిష్ ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాడు.
సినిమా ఆరంభాన్ని తూర్పు కనుమల్లో గంజాయి సాగు, తరలింపు కష్టాలు, అక్కడి ప్రజల పరిస్థితులు చూపిస్తూ ప్రారంభించారు. ఫస్ట్ హాఫ్‌లో ప్రధానంగా శీలావతి–దేశీ రాజు ప్రేమకథ, ఘాటీల జీవితం, మాఫియాల కబంధహస్తం చూపించారు. ఇంటర్వెల్‌కి దేశీ రాజు మరణం కథను మలుపు తిప్పి, సెకండ్ హాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది.
సెకండ్ హాఫ్ పూర్తిగా యాక్షన్ మోడ్‌లో సాగుతుంది. శీలావతి రివెంజ్, నాయుడు బ్రదర్స్‌తో జరిగిన పోరాటం కథకు ప్రధానంగా నిలుస్తాయి. క్లైమాక్స్‌లో శీలావతి సమాజానికి మెసేజ్ ఇచ్చే సన్నివేశాలు ఉన్నప్పటికీ అవి పెద్దగా కన్విన్స్ చేయలేకపోయాయి.
ఫస్ట్ హాఫ్‌లో కథనం నెమ్మదిగా సాగడం.. గంజాయి వల్ల సమాజానికి జరిగే నష్టాలను కథకు సరిగ్గా లింక్ చేయకపోవడం.. క్లైమాక్స్‌లో ఇచ్చిన సోషల్ మెసేజ్ క్రిష్ సినిమాల్లో ఉండే ప్రభావం లేకపోవడం.. ఎమోషన్ కన్నా ఎలివేషన్స్, విజువల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వంటివి ఈ మూవీకి మైనస్ గా చెప్పొచ్చు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
‘ఘాటి‘ సినిమాలో మొదటి నుండి చివరి వరకు పూర్తి బరువును మోసింది అనుష్క శెట్టి. శీలావతి పాత్రలో ఆమె నటన అద్భుతంగా ఉంది. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, లవ్ ట్రాక్—ఎక్కడ చూసినా తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టింది. చాన్నాళ్ల తర్వాత యాక్షన్ సీక్వెన్స్‌లలోనూ ఆకట్టుకుంది.
విక్రమ్ ప్రభు దేశీ రాజుగా తనదైన శైలిలో నటించి మంచి ఇంపాక్ట్ చూపించాడు. ఎమోషనల్ సీన్స్‌లో బావున్నా, ఆయనను ఇంకా బెటర్‌గా వాడుకోవచ్చనిపించింది.
చైతన్య రావు ఈ సినిమాకి సర్‌ప్రైజ్ ప్యాకేజ్. రెచ్చిపోయి విలనిజాన్ని ప్రదర్శించినా, కొన్ని సీన్స్‌లో అరుపులు ఎక్కువ కావడంతో ఓవర్‌గా అనిపించింది. రవీంద్ర విజయ్ పాత్ర బాగా రాసుకున్నాడు క్రిష్. రవీంద్ర విలనిజాన్ని బలంగా చూపిస్తూ తనదైన స్టైల్‌లో మెప్పించాడు. జగపతిబాబు పోలీస్ ఆఫీసర్‌గా సరదా టచ్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు.
డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరం ఒక కీలక పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచాడు.
సాంకేతిక విషయాల విషయానికొస్తే దర్శకుడు క్రిష్ ఈసారి తన పాత స్టైల్‌ను వదిలి, ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్‌పై ఫోకస్ చేశాడు. కథనం, డైలాగ్స్‌లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశాడు. అయితే, సీజీలపై ఇంకా శ్రద్ధ పెట్టి ఉంటే సినిమాకి మరింత రిచ్ ఫీలింగ్ వచ్చేదనిపిస్తుంది. సాయి మాదవ్ బుర్రా డైలాగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను అద్భుతంగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు బాగా కనిపించాయి.
చివరగా
గంజాయి మాఫియాపై ఘాటైన డ్రామా
Telugu70MM Rating: 2.5 / 5
-
Home
-
Menu