జాతీయ అవార్డులపై అసంతృప్తి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, యువ నటుడు విక్రాంత్ మెస్సీలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. షారుక్ ఖాన్‌కి ‘జవాన్’ మూవీ కోసం, విక్రాంత్‌కు ‘12th ఫెయిల్’ సినిమా కోసం ఈ గౌరవం లభించింది.
ఇదే సమయంలో మలయాళ సినిమా అభిమానులు మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, పృథ్వీరాజ్ సుకుమారన్ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవార్డుల ఎంపికపై జ్యూరీ పక్షపాతానికి ఆరోపణలు చేస్తున్నారు.
పృథ్వీరాజ్ 2024లో వచ్చిన 'ది గోట్ లైఫ్' సినిమాలో నజీబ్ పాత్రలో ప్రాణం పోసిన విధానం అందరినీ అబ్బురపరిచింది. బానిస బతుకును అనుభవించే ఒక మానవీయ పాత్రను ఆయన అత్యంత నిబద్ధతతో పోషించారు. 31 కిలోల బరువు తగ్గి, నాలుగు సంవత్సరాలు కష్టపడి జీవించిన అభినయం సినిమాకు ప్రాణం పెట్టింది. అయితే అంతటి శ్రమకు గుర్తింపుగా జాతీయ అవార్డు దక్కకపోవడంపై ఆయన అభిమానులు నెట్టింట స్పందిస్తున్నారు.
అంతేకాకుండా విక్రమ్ చేసిన తంగలాన్ వంటి సినిమాలు, దాంట్లోని పాత్రలు కూడా అవార్డుకు అర్హమని భావించిన ప్రేక్షకులు షారుక్ నటించిన 'జవాన్' వంటి సగటు కమర్షియల్ సినిమాకు ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చినందుకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రతిసారీ జాతీయ అవార్డులు ప్రకటించినపుడు ఓ పక్క అభినందనలు వెల్లువైతే, మరోపక్క అన్యాయం జరిగిందనే ఆరోపణలు రావడం సహజం. ఈసారి షారుక్ ఖాన్ ఎంపిక చర్చనీయాంశంగా మారింది. కానీ 'ది గోట్ లైఫ్' వంటి అద్భుతమైన చిత్రానికి, పృథ్వీరాజ్ లాంటి నటుడికి గుర్తింపు రాకపోవడం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు సినీ ప్రేమికులు. అలాగే విక్కీ కౌశల్ 'సామ్ బహదూర్', రణ్ బీర్ కపూర్ 'యానిమల్' చిత్రాలకు ఉత్తమ నటుడి కేటగిరీలో అవార్డులు రావాల్సి ఉంది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
-
Home
-
Menu