బకాయిలపై వివాదం.. నిర్మాత కౌంటర్

తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ కొన్ని కామెంట్స్ చేయడం.. వాటిని సినీ కార్మికులు ఖండించడం జరిగింది. అలాగే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తమ కార్మికులకు చాలా బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ సినీ కార్మికులు తెలిపిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమ ప్రొడక్షన్ లో పనిచేసిన వారి వేతనాలకు సంబంధించి ఓ నోట్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం..
గత 12 నెలల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో పనిచేసిన రోజువారీ కార్మికులకు రూ.60 కోట్లు చెల్లించింది. ఇందులో కంపెనీ ఉద్యోగుల వేతనాలు, కీ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్, వెండార్స్, వి.ఎఫ్.ఎక్స్ టీమ్స్, లొకేషన్స్ ఖర్చులు లేవు. ఉద్యోగుల నెలసరి వేతనాలు (రూ.30 కోట్లు) పూర్తిగా చెల్లించబడ్డాయి.
ఇక జూలై షెడ్యూల్‌కి సంబంధించిన సుమారు రూ.1 కోటి బకాయిలు ఉన్నాయని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంగీకరించింది. ఇవి కార్మికులు అందుబాటులో లేక ఆలస్యమయ్యాయని, వచ్చే వారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఇకపై పారదర్శకత కోసం మధ్యవర్తుల ద్వారా కాకుండా, నేరుగా కార్మికుల ఖాతాల్లోకి చెల్లింపులు చేస్తామని స్పష్టం చేసింది.
బకాయిలు ఉన్న వారు తమ బ్యాంక్ వివరాలతో ఎన్‌రోల్‌మెంట్ పూర్తి చేసి, సమాచారాన్ని సోమవారం లోపు అందించాలి. ధృవీకరణ తర్వాత చెల్లింపులు శుక్రవారం జారీ అవుతాయి. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు సంబంధిత యూనియన్లతో ఎటువంటి బకాయిలు లేవని, అంతర్గత చెల్లింపులపై సంబంధం లేని వారు వ్యాఖ్యానించడం అనవసరమని పేర్కొంది.
-
Home
-
Menu