‘కల్కి 2‘ నుంచి దీపిక అవుట్

‘కల్కి 2‘ నుంచి దీపిక అవుట్
X
ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్‌ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించింది.

ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్‌ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించింది. కేవలం బాక్సాఫీస్ హంగామా మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ భారతీయ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ప్రభాస్‌ భైరవ పాత్రలో అలరించగా, దీపికా పదుకొణె సుమతి పాత్రలో నటించి సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇక ‘కల్కి‘ సీక్వెల్ లోనూ దీపిక పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండనుంది.

కానీ తాజాగా చిత్రబృందం ఒక షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది. ‘కల్కి 2’లో దీపిక భాగం కాదని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ‘జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మేం ఒక నిర్ణయానికి వచ్చాం. ‘కల్కి‘ సీక్వెల్‌లో దీపిక భాగం కాదని అధికారికంగా ప్రకటిస్తున్నాం. మొదటి భాగంలో ఆమెతో చేసిన ప్రయాణం అద్భుతం అయినప్పటికీ, రెండో భాగానికి మా దారులు వేరయ్యాయి. ‘కల్కి‘ వంటి సినిమాకు భారీ నిబద్ధత కావాలి. భవిష్యత్తులో దీపిక మరెన్నో అద్భుతమైన సినిమాలు చేయాలని మా శుభాకాంక్షలు.‘ అని నిర్మాణ సంస్థ వైజయంతీ సోషల్ మీడియాలో తెలిపింది.

దీపిక ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడానికి నిజమైన కారణాలపై టాలీవుడ్‌లో రకరకాల టాక్ నడుస్తోంది. పారితోషికం విషయంలో అంగీకారం కుదరకపోవడం, పని గంటలపై డిమాండ్లు చేయడం వంటివి వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ‘స్పిరిట్’ ప్రాజెక్ట్ నుంచి కూడా దీపిక వైదొలిగిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రిని తీసుకున్నారు. ఇప్పుడు వరుసగా రెండు భారీ సినిమాల నుంచి ఆమె తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.



Tags

Next Story