సినీ కార్మికులతో సీఎం

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధులు, సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పష్టంగా మాట్లాడి, తమ అవసరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. ఇటీవల నిర్మాతలతో జరిగిన సమావేశాన్ని గుర్తుచేసుకుంటూ, కార్మికులను విస్మరించరాదని తాను అప్పటికే చెప్పానని ఆయన తెలిపారు. నైపుణ్యాల పెంపు కోసం నిర్మాతలు కార్మికులకు సహకరించాలని కోరినట్లు వెల్లడించారు.
చలనచిత్ర రంగంలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న తరుణంలో, కార్మికులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం అత్యవసరం అని సీఎం అన్నారు. ఇందుకోసం స్కిల్స్ యూనివర్సిటీలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. అన్ని భాషల చిత్రాలు తెలంగాణలో షూటింగ్ జరగాలని కోరుతూ, ముఖ్యంగా చిన్న సినిమా నిర్మాతలకు ప్రత్యేక సహకారం అందిస్తామని చెప్పారు. సమ్మెలు జరగడం వల్ల రెండు వర్గాలకీ నష్టం జరుగుతుందని, సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించాలని సూచించారు.
ప్రభుత్వం నిర్మాతలతో చర్చలు జరిపి కార్మికుల తరఫున నిలుస్తుందని స్పష్టం చేశారు. సమస్యలను సమస్యలుగానే చూసే విధానం తమదేనని, వ్యక్తిగత పరిచయాలు ఇక్కడ పనికిరావని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో తానే ముందుంటానని హామీ ఇచ్చారు. సినిమా కార్మికులకు త్వరలోనే ఆరోగ్య బీమా పథకం అమల్లోకి తెస్తామని చెప్పారు.
గత పది సంవత్సరాలుగా సినీ అవార్డులు ఇవ్వలేదని గుర్తుచేసిన సీఎం, తమ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. కళాకారులకు, కార్మికులకు గౌరవం దక్కేలా ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్, కార్యదర్శి అమ్మిరాజుతో పాటు అనేక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
-
Home
-
Menu