సెప్టెంబర్ నెలలో బాక్సాఫీస్

సెప్టెంబర్ నెలలో బాక్సాఫీస్
X
ఆగస్ట్ నెలలో తెలుగు బాక్సాఫీస్ కి మిశ్రమ స్పందన లభించింది. భారీ అంచనాలతో వచ్చిన ఎన్టీఆర్-హృతిక్ 'వార్ 2', మెగాబడ్జెట్ మూవీ ‘కూలీ’ కలెక్షన్ల పరంగా ఓ.కె. అనిపించినా.. లాంగ్ రన్ లో అంతగా ప్రభావం చూపించలేకపోయాయి.

ఆగస్ట్ నెలలో తెలుగు బాక్సాఫీస్ కి మిశ్రమ స్పందన లభించింది. భారీ అంచనాలతో వచ్చిన ఎన్టీఆర్-హృతిక్ 'వార్ 2', మెగాబడ్జెట్ మూవీ ‘కూలీ’ కలెక్షన్ల పరంగా ఓ.కె. అనిపించినా.. లాంగ్ రన్ లో అంతగా ప్రభావం చూపించలేకపోయాయి. చివర్లో విడుదలైన మలయాళం డబ్ మూవీ 'కొత్త లోక' కొంత ఊపిరి పోసింది. దీంతో ఇప్పుడు ఆశలన్నీ సెప్టెంబర్ మీదే ఉన్నాయి.

ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ఈ నెలలో విడుదల కాబోతుండడంతో మరింత హైప్ ఏర్పడింది. అయితే ముందుగా సెప్టెంబర్ 5న బాక్సాఫీస్ బరిలో పోటీ గట్టిగా ఉండబోతోంది. ఈ లిస్టులో ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది 'ఘాటి'.

అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో 'ఘాటి'పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. 'పుష్ప' తరహాలో మాస్ ఫీలింగ్ ఇచ్చేలా ట్రైలర్‌లు కనిపించడంతో మాస్ ఆడియన్స్‌లో క్రేజ్ పెరిగింది. అనుష్క పవర్‌ఫుల్ రోల్ లో కనిపించడం, క్రిష్ మార్క్ నేరేషన్ కలిసొస్తే 'ఘాటీ'కి బలమైన ఓపెనింగ్స్ రావడం ఖాయం.

సోషల్ మీడియా స్టార్ మౌళి హీరోగా వస్తున్న సినిమా లిటిల్ హార్ట్స్. యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ చిత్రం రూపొందింది. నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాస్ ఈ సినిమా సర్ప్రైజ్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు. మౌళికి సోషల్ మీడియాలో కలిగిన ఫాలోయింగ్ ఓపెనింగ్స్‌కు కొంత బలం ఇస్తుందనేది ట్రేడ్ అంచనా.

సెప్టెంబర్ 5న వస్తోన్న చిత్రాలలో 'మదరాసి' ఒకటి. ట్రైలర్ వచ్చే ముందు వరకూ పెద్దగా అంచనాలు లేకపోయినా.. ట్రైలర్ తర్వాత ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఒకప్పుడు స్టార్ బ్రాండ్‌గా ఉన్న ఏఆర్ మురుగదాస్ వరుస ఫ్లాప్స్‌తో ఉన్నాడు. అయినా శివ కార్తికేయన్ కి తెలుగులో ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని.. సినిమాకి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తే 'మదరాసి' మంచి హిట్ అయ్యే అవకాశాలున్నాయి.

సెప్టెంబర్ 12న ఆడియన్స్ ముందుకు రాబోతుంది 'మిరాయ్'. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని రూపొందిస్తున్న పాన్-ఇండియా ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది. విలన్ గా మంచు మనోజ్.. కీలక పాత్రల్లో రితిక నాయక్, జగపతిబాబు, శ్రియ, జయరాం కనిపించబోతున్నారు. త్రేతా యుగానికి, కలి యుగానికి లింక్ పెడుతూ ఓ మైథలాజికల్ సోషియో ఫాంటసీని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్న చిత్రమిది. 'మిరాయ్' భారీ అంచనాలతో థియేటర్లలోకి రాబోతుంది.

సెప్టెంబర్ 12నే రిలీజ్ డేట్స్ కన్ఫమ్ చేసుకున్న మరో రెండు చిత్రాలు 'కిష్కింధపురి, కాంత'. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన చిత్రం 'కిష్కింధపురి'. బెల్లంకొండ ఇప్పటివరకూ చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా హారర్ ఎలిమెంట్స్ తో సరికొత్తగా తయారయ్యింది. ఈ సినిమాకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తుండగా.. సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పీరియడ్‌ డ్రామా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 12న విడుదల కానుంది. రానా దగ్గుబాటి, దుల్కర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1950ల కాలంలో సినీ నేపథ్యంతో ఈ సినిమా రాబోతుంది. ముఖ్యంగా అప్పటి మద్రాస్‌ నేపథ్యంలో మానవ బంధాలు, సామాజిక మార్పులను ప్రధానంగా చూపించే కథ ఇది.

తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న కథానాయకుల్లో విజయ్ ఆంటోని ఒకరు. ఈ టాలెంటెడ్ స్టార్ నటించిన 'భద్రకాళి' సెప్టెంబర్ 19న విడుదలవుతోంది. విజయ్ ఆంటోని కెరీర్ లో 25వ చిత్రంగా 'భద్రకాళి' రాబోతుంది. అరుణ్ ప్రభు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఇక దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది పవన్ కళ్యాణ్ 'ఓజీ'. సాధారణంగా దసరా పండుగ అంటే అగ్రహీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేస్తాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2: తాండవం’ వాయిదా పడడంతో, దసరా బరిలో పవన్ కళ్యాణ్ 'ఓజీ' ఒక్కటే నిలవబోతోంది. దీంతో ఈ పండుగ పూర్తిగా 'ఓజీ' పండుగగా మారిపోనుంది.

‘సాహో’ డైరెక్టర్ సుజీత్ రూపొందిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అర్జున్ దాస్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం ఈ చిత్రానికి మరో ప్రధాన బలం.

Tags

Next Story