వరల్డ్ రికార్డ్స్ లో బాలయ్య

వరల్డ్ రికార్డ్స్ లో బాలయ్య
X
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డులు కొట్టడం నటసింహం బాలకృష్ణకు కొత్తేమీ కాదు. ఆ సినిమాల ద్వారానే ఇప్పుడు తన పేరిటే ప్రపంచంలో ఓ అరుదైన రికార్డును ఏర్పాటు చేసుకున్నారు బాలకృష్ణ.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డులు కొట్టడం నటసింహం బాలకృష్ణకు కొత్తేమీ కాదు. ఆ సినిమాల ద్వారానే ఇప్పుడు తన పేరిటే ప్రపంచంలో ఓ అరుదైన రికార్డును ఏర్పాటు చేసుకున్నారు బాలకృష్ణ. భారతీయ సినిమాల్లో హీరోగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యూకేకు చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయనకు ‘గోల్డ్ ఎడిషన్ రికగ్నిషన్’ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మైలురాయిని చేరుకున్న తొలి భారతీయ నటుడిగా బాలకృష్ణ చరిత్ర సృష్టించారు.

భారతీయ సినిమా చరిత్రలో ప్రధాన హీరోగా యాభై ఏళ్ల పాటు కొనసాగడం చాలా అరుదైన విషయం. ఈ విశిష్టమైన ఘనతను గుర్తించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ, బాలకృష్ణ సినీ సేవలను ప్రశంసిస్తూ ఆయన పేరును గోల్డ్ ఎడిషన్‌లో చేర్చింది. ఈ అరుదైన గౌరవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 30న హైదరాబాద్‌లో ప్రత్యేక సన్మాన కార్యక్రమం జరగనుంది. ఇందులో బాలకృష్ణకు అధికారికంగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.

50 ఏళ్ల క్రితం తెరంగేట్రం చేసిన బాలయ్య ఇప్పటికీ కథానాయకుడిగా వరుస విజయాలతో దూసుకెళ్తూనే ఉన్నారు. నటనతో పాటు, రాజకీయాలు, సామాజిక సేవల్లోనూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు వెళ్తున్నారు బాలకృష్ణ. ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు అందించింది.

జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో నటించి ఆ పాత్రలకు ప్రాణం పోసారు బాలకృష్ణ. కొన్ని పాత్రలకు బాలయ్య తప్ప మరెవ్వరు సెట్ కారు అన్నంతగా ఆ పాత్రలో జీవిస్తారు. తొలి చిత్రం 'తాతమ్మ కల' నుంచే తన ప్రత్యేకతను చాటుకున్నారు. బాల్యంలోనే 'దానవీర శూరకర్ణ'లో అభిమన్యుడిగా మెప్పించిన బాలయ్య, 'అక్బర్ సలీమ్ అనార్కలి' వంటి చిత్రాల్లో పరిణతి నటన కనబర్చారు. 1984లో సోలో హీరోగా 'సాహసమే జీవితం'తో ప్రయాణం ప్రారంభించిన ఆయన అదే ఏడాది 'మంగమ్మగారి మనవడు'తో మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.

మొదటి ఏడాదిలోనే ఏడు సినిమాలు రిలీజ్ చేసి రికార్డ్ సృష్టించారు. ఆరేళ్లలోనే అగ్రహీరోగా అవతరించారు. తర్వాతి దశలో 'ఆదిత్య 369, బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం' వంటి వైవిధ్యమైన చిత్రాలతో ట్రెండ్ సెట్టర్‌గా ఎదిగారు. 1999లో వచ్చిన 'సమరసింహారెడ్డి'తో రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. 'నరసింహనాయుడు'తో మొదటి నంది అవార్డు అందుకున్నారు.

దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పిన కథలతో 'సింహా, లెజెండ్, అఖండ' వంటి బ్లాక్‌బస్టర్లతో మాస్‌కు మరింత దగ్గరయ్యారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో చారిత్రక చిత్రాల్లోనూ తన సత్తా చాటారు. 'వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్' వంటి విజయాలతో వరుసగా హిట్స్ కొడుతూ, మరోసారి తన క్రేజ్‌ను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం 'అఖండ 2', గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో మరో సినిమాతో బిజీగా ఉన్నారు బాలయ్య.

Tags

Next Story