బాలయ్య.. ఓ ఎనర్జీ బ్రాండ్!

పల్లె పంచెకట్టులో సింహం లా కనిపించే హీరో.. మీసం తిప్పితే సింహం లా గర్జించే యోధుడు!. నటసార్వభౌముడు ఎన్టీఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ కొద్ది రోజుల్లోనే ‘బాలయ్య’ అనే BRAND గా మారిపోయాడు!. అభిమన్యుడిగా మొదలై.. అఖండుడయ్యేవరకూ అవతారాలే మారాయి. కానీ ఎనర్జీ ఒక్కటే! వయసు ఓ సంఖ్య మాత్రమే ఆయన ఎనర్జీ మాత్రం ఏజ్‌లెస్!. ఈరోజు (జూన్ 10) నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ పుట్టినరోజు.
తొలి చిత్రం 'తాతమ్మ కల' నుంచే తన ప్రత్యేకతను చాటుకున్నాడు. బాల్యంలోనే 'దానవీర శూరకర్ణ'లో అభిమన్యుడిగా మెప్పించిన బాలయ్య, 'అక్బర్ సలీమ్ అనార్కలి' వంటి చిత్రాల్లో పరిణత నటన కనబర్చాడు. 1984లో సోలో హీరోగా 'సాహసమే జీవితం'తో ప్రయాణం ప్రారంభించిన ఆయన అదే ఏడాది 'మంగమ్మగారి మనవడు'తో మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.
మొదటి ఏడాదిలోనే ఏడు సినిమాలు రిలీజ్ చేసి రికార్డ్ సృష్టించాడు. ఆరేళ్లలోనే అగ్రహీరోగా అవతరించాడు. తర్వాతి దశలో 'ఆదిత్య 369, బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం' వంటి వైవిధ్యమైన చిత్రాలతో ట్రెండ్ సెట్టర్‌గా ఎదిగాడు. 1999లో వచ్చిన 'సమరసింహారెడ్డి'తో రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. 'నరసింహనాయుడు'తో మొదటి నంది అవార్డు అందుకున్నాడు.
దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పిన కథలతో 'సింహా, లెజెండ్, అఖండ' వంటి బ్లాక్బస్టర్లతో మాస్కు మరింత దగ్గరయ్యాడు. 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో చారిత్రక చిత్రాల్లోనూ తన సత్తా చాటాడు. ఇటీవల 'వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్' వంటి విజయాలతో వరుసగా హిట్స్ కొడుతూ, మరోసారి తన క్రేజ్‌ను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం 'అఖండ 2', గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈరోజు నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ అందజేస్తుంది తెలుగు 70mm.
-
Home
-
Menu