వరల్డ్ రికార్డ్ అందుకున్న బాలయ్య

తెలుగు సినీ పరిశ్రమలో అగ్రశ్రేణి నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. కథానాయకుడిగా యాభై ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న బాలయ్యకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది.
తాజాగా హైదరాబాద్ లో జరిగిన వేడుకలో బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (గోల్డ్ ఎడిషన్) అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఏపీ మంత్రి లోకేష్, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, నటి జయసుధతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఏపీ విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాలయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 'బాలయ్య గారు ఎప్పుడూ యంగ్ అండ్ ఎనర్జిటిక్. ఆయన ఎనర్జీకి సీక్రెట్ మాకు ఇప్పటికీ తెలియదు. నిర్మాతలు, దర్శకుల డ్రీమ్ హీరో బాలయ్య బాబు. ప్రస్తుత ఓటీటీ యుగంలోనూ ఆయన తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను కొనసాగిస్తున్నారు' అని కొనియాడారు.
అలాగే, బాలయ్య భోళా మనిషి, మంచి మనసున్న వ్యక్తి అని పేర్కొన్నారు. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ఒకేలా నిలబడగల వ్యక్తి, ప్రజలకు అండగా ఉండే నాయకుడు అని లోకేష్ ప్రశంసించారు. 'సినిమా చరిత్ర రాయగలిగిన, తిరిగి రాయగలిగిన వ్యక్తి ఒక్క బాలయ్య బాబే. నాకు ముద్దుల మావయ్యగా ఆయన ఉండటం గర్వకారణం' అని అన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, 'బాలయ్య వయసు ఇప్పుడు 65. కానీ ఆయనను చూస్తే 25 ఏళ్ల యువకుడిలా కనిపిస్తారు. గంభీరత్వం, బోళాతనం, నిజాయితీ – ఇవన్నీ బాలయ్య ప్రత్యేకతలు. సినీ చరిత్రలో 50 ఏళ్లు హీరోగా నిలవడం అనేది అద్భుతం' అని ప్రశంసించారు.
దర్శకుడు బాబీ మాట్లాడుతూ, 'జై బాలయ్య అనేది ఒక మెడిసిన్. ఆయన కల్మషం లేని వ్యక్తి. అమెరికాలోని డల్లాస్‌ను కూడా బాలయ్యపురం చేసేశాడు' అన్నారు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ మాట్లాడుతూ, 'బాలయ్యను చూస్తే మాటలు రావు. చేతిలో కత్తులు, కర్రలు మొలుస్తాయి. ఆఖండ 2 ఇండస్ట్రీ రికార్డులు కొడుతుంది' అని అన్నారు.
బాలకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'నాకు ఈ గౌరవం లభించడం ఆనందంగా ఉంది. కళకు భాషా ప్రాంతీయ భేదాలు లేవు. నాకు జీవం ఇచ్చిన నా తండ్రి, నటసార్వభౌమ ఎన్టీఆర్ గారికి, తల్లి బసవతారకం గారికి ఘన నివాళి అర్పిస్తున్నాను. నా ప్రయాణంలో ఫ్యాన్స్, దర్శకులు, నిర్మాతలే నాకు స్ఫూర్తి. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతోంది. ఇది అందరికీ గర్వకారణం' అని అన్నారు.
అలాగే, ఏపీలోనూ సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, అద్భుతమైన లొకేషన్స్‌ను గుర్తించి అభివృద్ధి చేస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, కొత్త ప్రతిభకు అవకాశం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు.
-
Home
-
Menu