‘అర్జున్ S/O వైజయంతి‘ సినిమా రివ్యూ

నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సయీ మంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
ఎడిటింగ్ : తమ్మిరాజు
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
విడుదల తేది: ఏప్రిల్ 18, 2025
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి’. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించారు. కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘అర్జున్ S/O వైజయంతి’ ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి.. ఈ సినిమా ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
విశాఖపట్నం నగరంలో భయాన్ని రేకెత్తించే గ్యాంగ్‌స్టర్‌గా అర్జున్ (కళ్యాణ్ రామ్) హవా నడుస్తుంది. అతని పేరు చెబితే చాలు, నగరంలో ఎవరైనా వణికిపోతారు. కానీ, ఈ కఠినమైన గ్యాంగ్‌స్టర్ జీవితం వెనుక ఒక లోతైన కథ దాగి ఉంటుంది. అర్జున్ మాజీ ఐపీఎస్ అధికారిణి వైజయంతి (విజయశాంతి) కుమారుడు. తన తల్లిపై అపారమైన ప్రేమతో, ఆమెను కలవాలని అతను ఎప్పుడూ తపన పడుతూ ఉంటాడు.
అయితే.. వైజయంతి మాత్రం అర్జున్‌ను చూస్తే అసహ్యించుకుంటూ, అతని నుంచి దూరంగా ఉంటుంది. ఈ తల్లీకొడుకుల మధ్య ఈ అగాధం ఎందుకు ఏర్పడింది? ఐపీఎస్ అధికారిగా ఉండాల్సిన అర్జున్ ఎలా, ఎందుకు గ్యాంగ్‌స్టర్‌గా మారాడు? అతని జీవితంలో జరిగిన ఆ ఒడిదుడుకులు ఏమిటి? తల్లి ప్రేమ కోసం తపించే అర్జున్, చివరికి ఆమెను కలవగలిగాడా? అనే విషయాలు తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
నిజాయితీగల ఓ అధికారిణి కొడుకు పరిస్థితుల కారణంగా గ్యాంగ్‌స్టర్‌గా మారి, తన తల్లికి ఎదురుపడతాడు. కథ పాతదే. గతంలో ఇలాంటి తల్లి-కొడుకుల గొడవ, చివర్లో సయోధ్య కథలను చూసినప్పటికీ, ఈ సినిమా కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ మాస్ ప్రెజెన్స్, విజయశాంతి పోషించిన వైజయంతి పాత్ర ద్వారా కొత్తగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
ఫస్ట్ హాఫ్ బాగా వర్కౌట్ అయింది. పాత్రల పరిచయం, ఎమోషనల్ బేస్ బాగుంది. ముఖ్యంగా వైజయంతి కోణంలో అర్జున్ జీవితాన్ని ఆసక్తికరంగా చూపించిన సన్నివేశాలు బాగున్నాయి. అయితే.. సెకండ్ హాఫ్ కొంత సాగదీతగా, లాజిక్‌లు మిస్ అయిన ఫీలింగ్‌తో నడుస్తుంది.
ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు, అర్జున్ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కథ మొత్తం మీద క్లైమాక్స్ కీలకం. క్లైమాక్స్ లో మాత్రం తల్లి-కొడుకుల బంధాన్ని హృద్యంగా చూపించి పాస్ మార్కులు వేయించుకున్నాడు డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
ఈ చిత్రం ద్వారా కళ్యాణ్ రామ్ తన నటనా సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. అర్జున్‌గా తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. క్లైమాక్స్‌లో ఆయన అభినయం ఎంతో మెచ్యూర్డ్‌గా కనిపించింది. విజయశాంతి మరోసారి తన ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఆమె కోసం రూపొందించిన యాక్షన్ సీక్వెన్స్‌లు కథలో కీలకంగా నిలిచాయి. యాక్షన్ సీన్స్‌లో కూడా ఆమె ఎనర్జీ చూస్తే వావ్ అనాల్సిందే. సయీ మంజ్రేకర్ గ్లామర్ తో యూత్‌ని ఆకర్షించగా, శ్రీకాంత్, సోహైల్ ఖాన్, బబ్లూ పృథ్వీ వంటి వారు తమ పాత్రలతో అలరించే ప్రయత్నం చేశారు.
సాంకేతికంగా అజనీష్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా ఫైట్ సీన్స్‌లో సన్నివేశాలను ఉత్తేజపరిచేలా చక్కగా కుదిరింది. అయితే పాటల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అలాగే సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
చివరగా
‘అర్జున్ S/O వైజయంతి‘.. తల్లి-కొడుకు బంధంతో మాస్ ఎంటర్‌టైనర్
-
Home
-
Menu