అక్షయ్ కుమార్ భారీ విరాళం

ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఇటీవలి భారీ వర్షాల కారణంగా పంజాబ్ రాష్ట్రం తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. గత 37 ఏళ్లలో చూడని విపత్తుగా ఈ వరదలు నమోదయ్యాయి. అనేక మంది తమ ఇళ్లు, ఆస్తులు, జీవనోపాధి కోల్పోయారు. ఈ కష్ట సమయంలో బాధితులకు అండగా నిలవడానికి పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. వారిలో అగ్రగామిగా నిలిచాడు అక్షయ్ కుమార్.
అక్షయ్ కుమార్ పంజాబ్ వరద బాధితుల కోసం రూ. 5 కోట్ల సహాయం ప్రకటించాడు. అయితే దీనిపై ఆయన చేసిన వ్యాఖ్యలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 'ఇది నేను విరాళంగా ఇవ్వడం కాదు. ‘విరాళం’ అనే పదమే నాకు నచ్చదు. ఇతరులకు డొనేట్ చేయడానికి నేనెవరిని? ఇది కేవలం సేవ మాత్రమే. అవసరమైన వారికి సాయం చేసే అవకాశం రావడం నాకు అదృష్టం' అని అక్షయ్ స్పష్టం చేశాడు.
ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. 'పంజాబ్ వరద బాధితుల పునరావాసం కోసం రూ. 5 కోట్లు ఇస్తున్నాను. ఇది నా తరఫున చిన్న సహాయం మాత్రమే. బాధితులకు ఉపశమనం కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. నా సోదరులు, సోదరీమణుల కష్టాలు త్వరగా తీరాలని కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చాడు.
ఇది అక్షయ్ కుమార్ చేసిన తొలి సహాయం కాదు. ఆయన గతంలో కూడా పలు సందర్భాల్లో తన ఉదారతను చాటుకున్నాడు. చెన్నై వరదలు సమయంలో విరాళం ఇచ్చాడు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కోట్ల రూపాయలు సాయం చేశాడు. ‘భారత్ కీ వీర్’ కార్యక్రమం ద్వారా పలు సైనిక కుటుంబాలకు అండగా నిలిచాడు.
-
Home
-
Menu