ఆమిర్‌ vs ఎన్టీఆర్‌.. ఫాల్కేగా ఎవరు?

ఆమిర్‌ vs ఎన్టీఆర్‌.. ఫాల్కేగా ఎవరు?
X
భారతీయ సినీ పితామహుడు, తొలితరం ఫిల్మ్‌మేకర్‌ దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌ ప్రాజెక్ట్‌ ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ హాట్‌ టాపిక్‌గా మారింది.

భారతీయ సినీ పితామహుడు, తొలితరం ఫిల్మ్‌మేకర్‌ దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌ ప్రాజెక్ట్‌ ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. ఫాల్కే పాత్రలో నటించేందుకు అగ్రనటులు ఆమిర్‌ ఖాన్, ఎన్టీఆర్‌లు ముందస్తుగా ఉన్నారన్న వార్తలు, వేర్వేరు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఈ కథతో ప్రాజెక్ట్‌లు ప్రకటించడంతో, ఇండస్ట్రీలో ఆసక్తికర పోటీ నెలకొంది.

ఇటీవల అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌లో ఆమిర్‌ ఖాన్ టైటిల్ రోల్‌ పోషించనున్నారు. ఈ చిత్రానికి 'త్రీ ఇడియట్స్, పీకే' వంటి బ్లాక్‌బస్టర్ల దర్శకుడు రాజ్‌కుమార్‌ హీరాణీ దర్శకత్వం వహించనున్నారు. హీరాణీతో పాటు అభిజిత్‌ జోషీ, హిందూకుష్‌, ఆవిష్కర్‌ భరద్వాజ్‌లు స్క్రిప్ట్‌పై గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. దాదాసాహెబ్‌ మనవడు చంద్రశేఖర్‌ శ్రీకృష్ణ పుసాల్కర్‌ ఈ ప్రాజెక్టుకు మద్దతు ప్రకటించారన్నది మరో విశేషం.

మరోవైపు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి 'మేడ్‌ ఇన్‌ ఇండియా' పేరుతో మరో ఫాల్కే బయోపిక్‌ను సమర్పించబోతున్నట్టు 2023 సెప్టెంబరులోనే ప్రకటించారు. ఈ చిత్రాన్ని నితిన్‌ కక్కడ్‌ డైరెక్ట్‌ చేయనుండగా, ఎస్‌.ఎస్‌. కార్తికేయ, వరుణ్‌ గుప్తా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌ టైటిల్‌ రోల్‌ చేయనున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్‌ వర్క్ పూర్తై, ప్రీ-ప్రొడక్షన్‌ తుది దశకు చేరిందని సమాచారం.

ఒకే వ్యక్తి జీవితం ఆధారంగా రెండు భారీ బయోపిక్‌లు సమకాలీనంగా సెట్స్‌ పైకి వెళ్లబోతుండటంతో ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకవైపు బాలీవుడ్‌ టాప్‌ కాంబో (ఆమిర్‌ – హీరాణీ), మరోవైపు పాన్‌ ఇండియా క్రేజ్‌ ఉన్న ఎన్టీఆర్‌ – రాజమౌళి బ్రాండ్‌. ఈ పోటీలో ఎవరు ముందుగా మొదలుపెడతారు? ప్రేక్షకుల్ని ఎవరు మెప్పిస్తారు? అన్నదానికి సమాధానం త్వరలో వెలువడనుంది.


Tags

Next Story